వరస డిజాస్టర్లతో సతమతమవుతున్న సూర్యకు కంగువ, రెట్రో ఇచ్చిన షాకులు మామూలువి కాదు. కమర్షియల్ గా ప్రూవ్ చేసుకున్న ఇద్దరు పెద్ద డైరెక్టర్లతో చేతులు కలిపితే వాళ్లేమో జీవితంలో మర్చిపోలేని ఫ్లాపులు కానుకగా ఇచ్చారు. దెబ్బకు సూర్య మార్కెట్ రిస్కుతో పడిందనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆర్జె బాలాజీ దర్శకత్వంలో తను నటించిన కొత్త సినిమా కరుప్పు షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. ఫాంటసీ టచ్ ఉన్న మాస్ సబ్జెక్టుగా అభిమానుల్లో దీని మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే రిలీజ్ డేట్ విషయంలో టీమ్ ఇప్పటిదాకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం విచిత్రం.
తొలుత 2026 సంక్రాంతి అనుకున్నారు. కానీ జనవరి 9 జన నాయగన్, జనవరి 14 పరాశక్తి వస్తున్నాయి. వీటి మీదున్న హైప్ తో పోలిస్తే కరుప్పు దరిదాపుల్లో కూడా లేదు. పైగా తెలుగు వెర్షన్ కు పోటీగా రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ గారు, అనగనగా ఒక రాజు, రవితేజ 76 అఫీషియల్ గా రేస్ లో ఉన్నాయి. వీటితో పోటీ పడితే కరుప్పు కారు కింద అప్పడంలా నలిగిపోవడం ఖాయం. అందుకే అంత రిస్క్ ఎందుకులే అని భావించి ఏప్రిల్ 14 వైపు చూస్తున్నారని చెన్నై టాక్. అంటే ఇప్పటి నుంచి ఆరు నెలల పైనే సమయం ఉంటుంది. ఇంకో ట్విస్ట్ ఏంటంటే కోరుకున్న రేట్ కి కరుప్పు ఓటిటి డీల్ జరగలేదట.
ఇంకో వైపు మన టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో సూర్య చేస్తున్న సినిమా శరవేగంగా పరుగులు పెడుతోంది. నిజానికి దీన్ని సమ్మర్ లో రిలీజ్ చేయాలని సితార సంస్థ ప్లాన్ చేస్తోంది. ఇప్పుడు కరుప్పు కనక ఏప్రిల్ కోరుకుంటే అప్పుడు వెంకీ మూవీని దసరా లేదా దీపావళికి వాయిదా వేయాల్సి ఉంటుంది. ఆర్జె బాలాజీకి దర్శకుడిగా మార్కెట్ లో పెద్దగా బ్రాండ్ లేకపోవడం బిజినెస్ మీద ప్రభావం చూపిస్తోందట. అందుకే ఆచితూచి అడుగులు వేస్తున్నారని సమాచారం. అర్థం కాకుండా తెలుగులోనూ కరుప్పు టైటిల్ నే కొనసాగిస్తున్న నిర్మాతలు విడుదల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates