సిద్దులో ఇంత రొమాన్స్ ఉందని తెలియదే

డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సిరీస్ తో యూత్ ఫాలోయింగ్ దక్కించుకున్న సిద్ధూ జొన్నలగడ్డకు ఈ ఏడాది ఏప్రిల్ లో జాక్ రూపంలో పెద్ద షాకే కొట్టింది. కామెడీ, మిక్స్ చేసి చూద్దామని దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ చేసిన ప్రయోగం బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని ఇచ్చింది. దీంతో తనకు సూట్ కాని జానర్లను దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న సిద్ధూ ఈసారి ఫుల్ రొమాంటిక్ మూడ్ లో తెలుసు కదాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నీరజ కోన దర్శకురాలిగా పరిచయమవుతున్న ఈ లవ్ డ్రామాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. అక్టోబర్ 17 థియేటర్ రిలీజ్ కాబోతున్న తెలుసు కదా టీజర్ ఇవాళ వచ్చింది.

స్టోరీ చెప్పీ చెప్పకుండా తెలివిగా కట్ చేశారు. చెఫ్ గా జీవితాన్ని నడిపిస్తున్న ఓ యువకుడి జీవితంలో ఇద్దరు అమ్మాయిలు ప్రవేశిస్తారు. ఎవరినీ కాదనలేడు. ఒక్కొక్కరిలో ఒక్కో ప్రత్యేకత అతన్ని కట్టిపడేస్తుంది. రెండు ఆప్షన్ల మధ్య సతమతమావుతూనే ఇద్దరికీ ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుందామని ఆఫర్ చేస్తాడు. ట్విస్ట్ ఏంటంటే ఇద్దరూ కలిసి ఇతనితో లివ్ ఇన్ కి సిద్దపడటం. మరి సంప్రదాయాన్ని కాదనకుండానే ఒక్కరినే ఎంచుకోవాలనే సందిగ్ధంలో ఉన్న ఆ కుర్రాడు చివరికి ఏం నిర్ణయించుకున్నాడనేది తెరమీద చూడాలి. సిద్ధూ లుక్స్, పెర్ఫార్మన్స్ చాలా కూల్, సెటిల్డ్ గా కనిపిస్తున్నాయి.

శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా పోటీపడి మరీ సిద్ధూని ట్రాప్ చేసే పాత్రల్లో ఫ్రెష్ గా కనిపిస్తున్నారు. బ్యాక్ గ్రౌండ్ లో తమన్ బీజీఎమ్ స్మూత్ గా సాగిపోయి కంటెంట్ లో ఉన్న మూడ్ కి తగ్గట్టు హాయిగా ఉంది. ఈ మధ్య ఇలా టూ గర్ల్స్, వన్ బాయ్ కథలు రావడం లేదు. తెలుసు కదా ఆ రకంగా కూడా డిఫరెంట్ గా అనిపిస్తోంది. లౌడ్ కామెడీ లేకుండా సిద్దు జొన్నలగడ్డ ఈ సారి సున్నితమైన హాస్యాన్ని ఎంచుకున్నాడు. డైలాగులు కూడా అలాగే ఉన్నాయి. వైవా హర్షని తప్ప ఇతర ఆర్టిస్టులను రివీల్ చేయలేదు. మిరాయ్ రిలీజ్ తర్వాత తెలుసు కదా ప్రమోషన్లను పెద్ద ఎత్తున చేసేందుకు పీపుల్స్ మీడియా టీమ్ రెడీ అవుతోంది.