ఎల్లుండి విడుదల కాబోతున్న కిష్కిందపురి ప్రమోషన్లలో భాగంగా హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ పెద్ద స్టేట్ మెంట్ ఇచ్చాడు. పది నిమిషాల తర్వాత ఎవరైనా సినిమాలో లీనం కాకుండా ఫోన్ చూసుకునేలా తమ కంటెంట్ ఉంటే కనక ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోతానని దాని సారాంశం. ఇది వైరల్ కావడం కోసం చేసిన వ్యాఖ్యా లేక కంటెంట్ లో నిజంగా అంత దమ్ము ఉందా అనేది థియేటర్ లో చూస్తే కానీ అర్థం కాదు. అయినా ఇలాంటి స్టేట్ మెంట్స్ ఏదో ఊపు ఇవ్వడం వదలడం బాగానే ఉంది కానీ వాటి వల్ల మేలు జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి. సోషల్ మీడియాలో లేనిపోని ట్రోలింగ్ కి దారి తీస్తాయి.
ఆ మధ్య భైరవం టైంలో కూడా ఇంటర్వెల్ ఎపిసోడ్ కాంతారని మించిన గూస్ బంప్స్ ఇస్తుందని సాయి శ్రీనివాస్ చెప్పుకొచ్చాడు. తీరా చూస్తే అస్సలా ఫీలింగే రాలేదు. ఇంటెన్స్ అంటే జాతర పెడితే చాలు ఎపిసోడ్ దానంతటదే హై ఇస్తుందని దర్శకుడు భావించడం వల్ల తెర మీద సరిగా ఆవిష్కరించలేకపోయారు. అయినా 5జి జమానాలో ఫోన్లు పూర్తిగా ఆఫ్ చేసి మరీ సినిమాలు చూసే ప్రేక్షకులు ఇప్పుడు చాలా తక్కువ. తొంభై శాతం జనాలు స్క్రీన్ మీద ఎంత ఎక్స్ ట్రాడినరి విజువల్స్ నడుతున్నా పావుగంటకోసారి ఫోన్ అప్డేట్స్ చూసుకోకుండా ఉండలేరు. అంతగా సెల్ ఫోన్ చొచ్చుకుపోయింది.
మరి బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఉద్దేశం ఏదైనా పెద్ద మాటే అనేశాడు. టీమ్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే మిరాయ్ లాంటి పెద్ద పోటీ ఉన్నా సరే తమది నిలబడుతుందనే ధీమా కనిపిస్తోంది. కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వం వహించిన ఈ హారర్ డ్రామాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. తనకూ ఈ సక్సెస్ చాలా కీలకం. గంపెడాశలు పెట్టుకుని పరదా చేస్తే అదేమో వర్కౌట్ కాలేదు. ఇటు సాయిశ్రీనివాస్ సైతం తన మార్కెట్ మళ్ళీ పుంజుకోవాలంటే కిష్కిందపురి మెప్పించడం చాలా ముఖ్యం. నిర్మాత అన్ని ఏరియలు స్వంతంగా రిలీజ్ చేస్తున్నారని ట్రేడ్ టాక్. ఇది మాములు కాన్ఫిడెన్స్ కాదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates