బాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన బోనీ కపూర్.. ఈ మధ్య సినిమాల నిర్మాణం తగ్గించేశారు. చివరగా ఆయన్నుంచి ‘మైదాన్’ సినిమా వచ్చింది. ఆ సినిమా రిలీజై ఏడాదిన్నర కావస్తున్నా.. కొత్తగా మరే చిత్రాన్ని మొదలుపెట్టలేదు బోనీ. కనీసం అనౌన్స్‌మెంట్ కూడా లేదు. ఆయనకు ఇక సినిమాలు ప్రొడ్యూస్ చేసే ఉద్దేశం ఉందా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. ‘మైదాన్’ సినిమా బోనీని అంతగా దెబ్బ కొట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమా బోనీతో పాటు సహ నిర్మాతలైన జీ స్టూడియోస్ వారికి ఏకంగా వంద కోట్ల మేర నష్టం తెచ్చిపెట్టిందట.
‘బదాయి హో’ లాటి మంచి సినిమా తీసిన అమిత్ శర్మ దర్శకత్వంలో అజయ్ దేవగణ్ కథానాయకుడిగా నటించిన సినిమా ఇది. సయ్యద్ అబ్దుల్ రహీమ్ అనే హైదరాబాదీ దిగ్గజ ఫుట్‌బాలర్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కానీ ఆశించిన వసూళ్లు రాలేదు. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది.
బడ్జెట్ తడిసిమోపెడు కావడం ‘మైదాన్’కు అతి పెద్ద సమస్యగా మారింది. సినిమా మొదలైన నాలుగైదేళ్ల తర్వాతే ఈ చిత్రం రిలీజైంది. కొవిడ్ వల్ల షెడ్యూళ్లన్నీ మారిపోయి బడ్జెట్ అనుకున్న దాని కంటే ఏకంగా రూ.90 కోట్లు పెరిగిందట. ఈ సినిమా విషయంలో మొత్తం అస్తవ్యస్తంగా మారి తాము ఎలా నష్టపోయామో బోనీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
‘‘మేం రూ.120 కోట్ల బడ్జెట్లో ఈ సినిమా తీయాలనుకున్నాం. కానీ సినిమా పూర్తయ్యేసరికి రూ.210 కోట్లు అయ్యింది. కొవిడ్ రాకముందు సినిమా చిత్రీకరణ 70 శాతం మేర పూర్తయింది. 2020 మార్చిలో ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు సంబంధించిన సన్నివేశాలు తీయాలనుకున్నాం. ఇంటర్నేషనల్ టీమ్స్ వచ్చాయి. అంతలో లాక్‌డౌన్ వచ్చింది. విమాన ప్రయాణాలు రద్దయ్యాయి. కొన్ని నెలల పాటు లాక్‌డౌన్ కొనసాగడంతో ఆటగాళ్లందరికీ ముంబయిలో వసతి ఏర్పాటు చేయాల్సి వచ్చింది.
తర్వాత మ్యాచ్‌లను షూట్ చేసే సమయంలో 800 మంది దాకా సెట్స్‌లో ఉండేవారు. వాళ్లందరికీ తాజ్ హోటల్ నుంచి భోజనాలు తెప్పించేవాడిని. కొవిడ్ నిబంధనల వల్ల నాలుగు అంబులెన్సులు, పలువురు వైద్యులను పెట్టుకోవాల్సి వచ్చింది. భోజనాల కోసం టెంట్లు ఏర్పాటు చేశాం. మంచి నీళ్ల బాటిళ్లకే కొంత బడ్జెట్ కేటాయించామంటే అర్థం చేసుకోండి. ఆ డబ్బుతో ఒక చిన్న సినిమా తీయొచ్చు.
కొన్ని కీలక సన్నివేశాలు తీయడానికి టీం బ్యాంకాక్ వెళ్తే అక్కడా ఖర్చు పెరిగింది. ఇంకోపక్క ముంబయిలో ఫుట్‌బాల్ స్టేడియం సెట్ వేస్తే అది తుపాను వల్ల కొట్టుకుపోయింది. ఇలా ఊహించని ఖర్చులు వచ్చి పడి బడ్జెట్ అసాధారణంగా పెరిగింది. ఇంత కష్టపడి సినిమా పూర్తి చేస్తే రిలీజ్ ఆలస్యమవడమే కాక, మైదాన్ ఫ్లాప్ అయింది. నా పరిస్థితి అర్థం చేసుకుని టీంలో కొందరు తమ పారితోషకాలను 15 శాతం మేర తగ్గించుకున్నారు. ఇలా జరగడం విధి. ఎవరినీ నిందించలేం’’ అని బోనీ ఆవేదన వ్యక్తం చేశాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates