హెడింగ్ చూసి ఆశ్చర్యపోతున్నారా. టాలీవుడ్ దర్శక నిర్మాతలు కొందరు ప్రస్తుతం ఇదే ప్రశ్న వేసుకుంటున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా ఒక ఓటిటి సినిమాగా మొదలై థియేటర్లలో విడుదలైన లిటిల్ హార్ట్స్ ఇంత పెద్ద విజయం సాధించడం చూసి చాలా మందికి నిద్ర రావడం లేదు. సోషల్ మీడియాలో పాపులరైన మౌళిని టికెట్లు కొని మరీ థియేటర్లలో చూస్తారా అనే అనుమానాలు బద్దలు కొడుతూ కేవలం మూడు రోజులకే పన్నెండు కోట్ల గ్రాస్ వసూలు చేయడం ఆషామాషి విషయం కాదు. అందులోనూ మొదటి రోజే బ్రేక్ ఈవెన్ కావడం ఈ మధ్య కాలంలో ఏ సినిమాకు జరగలేదన్నది అందరూ ఒప్పుకునే వాస్తవం.
మరి లిటిల్ హార్ట్స్ ఇంతగా సక్సెస్ కావడానికి కారణమేంటని తెలుసుకోవడానికి పెద్దగా రీసెర్చ్ అక్కర్లేదు. చిన్న కామన్ సెన్స్ అంతే. ప్రేక్షకులు వరల్డ్ బిల్డింగ్ సినిమాలు చూసి బోర్ కొట్టేసి కాస్త ఫ్రెష్ నెస్, ఎంటర్ టైన్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. టయర్ 2 స్టార్లు సైతం కెజిఎఫ్, పుష్ప లాంటివి కోరుకుంటూ నిర్మాతలతో కోట్లు ఖర్చు పెట్టిస్తున్న టైంలో ఓ రెండు గంటలు నవ్వుకునే సినిమాలు రావడం తగ్గిపోయింది. జాతిరత్నాలు తర్వాత మళ్ళీ ఆ స్థాయి ఇంపాక్ట్ వేరే మూవీ చూపించలేదు. అంత కాకపోయినా లిటిల్ హార్ట్స్ ఈ మాత్రం గ్రాండ్ రెస్పాన్స్ దక్కించుకోవడం భుజాలు తడుముకుని మరీ ఆలోచించాల్సిన విషయం.
వీక్ డేస్ మొదలయ్యాయి కాబట్టి డ్రాప్స్ ఎంత శాతం ఉంటాయనే దాన్ని బట్టి లిటిల్ హార్ట్స్ రేంజ్ ఆధారపడి ఉంది. నిర్మాతలు ఇప్పటికే లాభాల్లో ఉన్నారు. ఈటీవీ విన్ మరో జాక్ పాట్ కొట్టేసింది. కాకపోతే ఈ వారం మిరాయ్, కిష్కిందపురి లాంటి పెద్ద సినిమాలు వస్తున్న నేపథ్యంలో రాబోయే వీకెండ్ కొంచెం టఫ్ గా ఉండొచ్చు. అయినా సరే యూత్ మాత్రం లిటిల్ హార్ట్స్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా థియేటర్స్ లో చూడనివాళ్ళు ప్లాన్ చేసుకునే పనిలో ఉన్నారు. ఫైనల్ రన్ అయ్యేలోగా పాతిక కోట్ల గ్రాస్ అందుకోవచ్చనే అంచనాలున్నాయి. చూడాలి ఏం చేయనుందో.
Gulte Telugu Telugu Political and Movie News Updates