బన్నీ వాసు అంటే గీతా ఆర్ట్స్.. గీతా ఆర్ట్స్ అంటే బన్నీ వాసు.. రెండు దశాబ్దాలకు పైగా సాగుతున్న బంధమిది. అల్లు అర్జున్ స్నేహితుడిగా గీతా ఆర్ట్స్‌లోకి ప్రవేశించిన వాసు.. బయటి వాడు అయినప్పటికీ.. అల్లు కుటుంబంలో ఒకడిలా మారిపోయాడు. నిర్మాణ సంస్థను అతడి చేతికి అప్పగించి ప్రొడక్షన్ మొత్తం తనే చూసుకునే స్వేచ్ఛ ఇచ్చారు అల్లు అరవింద్. అల్లువారి అనుభవం, వాసు యంగ్ మైండ్ కలిసి ఆ సంస్థ విజయవంతంగా సాగుతోంది. ఒకప్పటి దిగ్గజ నిర్మాణ సంస్థలు చాలానే ప్రొడక్షన్ ఆపేసి తెరమరుగు అయిపోగా.. గీతా ఆర్ట్స్ మాత్రం సక్సెస్ ఫుల్‌గా సాగడంలో బన్నీ వాసు పాత్ర కీలకం. ఐతే ఈ మధ్య వాసు తనకంటూ ఒక నిర్మాణ సంస్థ ఉండాలనుకున్నాడు.
అలా అని అతనేమీ గీతా సంస్థ నుంచి బయటికి వచ్చేయలేదు. అరవింద్‌తో విభేదించలేదు. తన అభిరుచి మేరకు వేరుగా సినిమాలు నిర్మించడం, డిస్ట్రిబ్యూట్ చేయాలనుకున్నాడు. అందులో భాగంగానే మిత్రమండలి అనే సినిమాను నిర్మిస్తున్నాడు. దీంతో పాటు వంశీ నందిపాటితో కలిసి లిటిల్ హార్ట్స్ అనే చిన్న సినిమాను డిస్ట్రిబ్యూట్ చేశాడు.
బన్నీ వాసు ‘లిటిల్ హార్ట్స్’ను డిస్ట్రిబ్యూట్ చేయడం వెనుక మరో వ్యక్తి పాత్ర కీలకం. అతనే.. వంశీ నందిపాటి. కంటెంట్ ఉన్న చిన్న సినిమాలను గుర్తించి డిస్ట్రిబ్యూట్ చేసి మంచి ఫలితాలు అందుకుంటాడని వంశీకి పేరుంది. ‘పొలిమేర-2’ సహా కొన్ని చిత్రాలతో అతను సక్సెస్ సాధించాడు. ‘లిటిల్ హార్ట్స్’లో మంచి కంటెంట్ ఉందనే విషయాన్ని గుర్తించి.. బన్నీ వాసుకు సినిమా చూపించి, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక తనతో కలిసి సినిమాను కొని రిలీజ్ చేసింది వంశీనే.
చిన్న బడ్జెట్ సినిమా కావడంతో రూ.2.5 కోట్లకే సినిమా హక్కులు దక్కాయి. మామూలుగా అయితే ఈ సినిమా రేంజికి అది పెద్ద రేటే. కానీ కంటెంట్ మీద నమ్మకంతో బన్నీ వాసు, వంశీ ధైర్యం చేశారు. ఆ ధైర్యం ఇప్పుడు వారికి పెట్టుబడి మీద కొన్ని రెట్ల లాభాన్ని అందించబోతోంది. రెండు రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయిపోయిన సినిమాకు ఆదివారం నుంచి వచ్చేదంతా లాభమే. రోజు రోజుకూ షోలు, స్క్రీన్లు పెరుగుతున్నాయి ఈ చిత్రానికి. ఫుల్ రన్లో ఈజీగా రూ.10 కోట్ల షేర్ మార్కును దాటేలా కనిపిస్తోందీ చిన్న చిత్రం. బన్నీ వాసు వేరే సంస్థను పెట్టకపోతే.. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ తరఫున రిలీజ్ చేసేవాడేమో. కానీ ఇప్పుడు వంశీతో కలిసి సొంత సంస్థలో రిలీజ్ చేయడంతో జాక్ పాట్ ఈ ఇద్దరికే తగిలింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates