మిరాయ్ కథ చెప్పేసిన దర్శకుడు

మిరాయ్.. తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా. ఆ మాటకొస్తే ఇతర భాషల్లోనూ ఈ సినిమాపై క్యూరియాసిటీ కనిపిస్తోంది. ‘హనుమాన్’ హీరో తేజ సజ్జ లీడ్ రోల్ చేయడం.. టీజర్, ట్రైలర్ వేరే లెవెల్ అనిపించడమే ఈ ఆసక్తికి కారణం. కొంచెం అడ్వెంచరస్‌గా సాగే కథలకు డివైన్ ఎలిమెంట్‌ జోడిస్తే పాన్ ఇండియా స్థాయిలో అద్భుతమైన ఫలితం వస్తుందని.. హనుమాన్, కార్తికేయ-2, కాంతార లాంటి చిత్రాలు రుజువు చేశాయి. ఈ ట్రెండును అందిపుచ్చుకుంటూ యువ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఎంతో కసరత్తు చేసి ‘మిరాయ్’ను తీర్చిదిద్దాడు.

ఈ సినిమా కథను దాచిపెట్టాలని అతనేమీ భావించట్లేదు. ట్రైలర్లో స్టోరీ మీద ఐడియా వచ్చేలా ఒక హింట్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్లలో కథ గురించి అతను ఓపెన్ అయిపోయాడు. దాని గురించి అతనేమన్నాడంటే..?

‘‘అశోక చక్రవర్తి దగ్గర తొమ్మిది దైవ గ్రంథాలు ఉండేవనే ఒక కల్పిత పురాణం ప్రచారంలో ఉంది. మానవాళికి ఎలాంటి సమస్య ఎదురైనా.. ఆ గ్రంథాల్లో పరిష్కారం ఉంటుందని.. దాన్ని సొంతం చేసుకోవడానికి జర్మనీ నియంత హిట్లర్ కూడా ప్రయత్నించాడని అంటారు. అలాంటి విలువైన గ్రంథాలు ఒక దుష్టుడి చేతుల్లోకి వెళ్తే ఏం జరుగుతందన్నదే ఈ కథ.

మన ఇతిహాసాల సాయంతో ఒక సూపర్ హీరో ఆ దుష్ట శక్తిని ఎలా అడ్డుకున్నాడన్న నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుంది. ఈ కథకు వర్తమానంతో పాటు త్రేతాయుగంతో ముడిపెట్టాం. అశోకుడిని శ్రీరాముడిని ఎలా కలిపాం.. ఆ తొమ్మది గ్రంథాలు అశోకుడి చేతికి ఎలా వచ్చి ఉండొచ్చు అన్నది కల్పిత విషయాలతో చెప్పే ప్రయత్నం చేశాం’’ అని కార్తీక్ వెల్లడించాడు. ఆరేళ్ల కిందట మొదలైన ఆలోచన ఇదని.. స్క్రిప్టు రాయడానికి చాలా టైం పట్టిందని.. తర్వాత చిత్రీకరణకు మూడేళ్లు టైం పట్టిందని.. అనవసర ఖర్చును తగ్గించుకుని మేకింగ్ కోసం ఎక్కువ డబ్బులు పెట్టాలని ఆర్టిస్టులందరూ కారవాన్లు లేకుండా పని చేశారని.. పరిమిత బడ్జెట్లోనే గొప్ప ఔట్ పుట్ తీసుకొచ్చామని కార్తీక్ తెలిపాడు. ‘మిరాయ్’ ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.