90స్ దర్శకుడి హ్యాట్రిక్ పాత్రలు

ఇండస్ట్రీలో సక్సెస్ అన్నింటికీ మూలం. అది ఒక రంగంలో నిరూపించుకోవడమే చాలా మందికి అతి పెద్ద సవాల్. అలాంటిది మూడు క్రాఫ్ట్స్ లో సక్సెస్ ఫుల్ గా నిలవడం మాములు విషయం కాదు. ఆదిత్య హాసన్ దానికి ఉదాహరణగా నిలుస్తున్నాడు. ఈటీవీ విన్ లో వచ్చిన 90స్ మిడిల్ క్లాస్ వెబ్ సిరీస్ ద్వారా పరిచయమైన ఈ యంగ్ టాలెంట్ డెబ్యూతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అప్పటిదాకా సబ్స్క్రైబర్ల కోసం రకరకాల కసరత్తులు చేస్తున్న ఈటీవీ విన్ ఓటిటికి అది జాక్ పాట్ లా నిలబడింది. దెబ్బకు చాలా గ్యాప్ తీసుకున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ శివాజీ ఒక్కసారిగా బిజీ అయిపోయాడు. కోర్ట్ అవకాశం వచ్చి ఇప్పుడు డేట్లు దొరకడం లేదు.

ఇదే ఆదిత్య హాసన్ మలయాళం డబ్బింగ్ ప్రేమలుకు తెలుగు సంభాషణలు రాశాడు. ఎస్ఎస్ కార్తికేయ ప్రత్యేక రిక్వెస్ట్ మీద తనదైన టైమింగ్ తో థియేటర్లో నవ్వులు పూయించేలా చేశాడు. తాజాగా లిటిల్ హార్ట్స్ తో నిర్మాతగా మారి ఇక్కడా జయకేతనం ఎగరేశాడు. 90స్ తో పాపులారిటీ తెచ్చుకున్న సోషల్ మీడియా స్టార్ మౌళిని హీరోగా మార్చి సాయి మార్తాండ్ అనే స్నేహితుడిని దర్శకుడిగా అతనికీ ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. ఇలా డైరెక్టర్, రైటర్, ప్రొడ్యూసర్ మూడు భూమికల్లో ఆదిత్య హాసన్ సక్సెస్ కావడం విశేషం. ఈ ప్రాజెక్టులన్నిటిలోనూ ఇతరుల భాగస్వామ్యం ఉన్నప్పటికీ ఆదిత్య హాసనే ప్రధాన రూపకర్త.

ప్రస్తుతం తను ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కాంబోలో సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ఒక సినిమా చేస్తున్నాడు. 90స్ మిడిల్ క్లాస్ లో ఉన్న ప్రేమ జంట ఇప్పుడు పెద్దయ్యాక ఎలా ప్రేమించుకుంటారనే పాయింట్ మీద ఇది రూపొందుతోందని సమాచారం. ఎక్కువ శాతం షూటింగ్ విదేశాల్లోనే జరుగుతోంది. నిర్మాత నాగవంశీ కాబట్టి బడ్జెట్ పెద్దగానే పెడుతున్నారు. రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ లవ్ స్టోరీగా రూపొందుతూ అవుట్ అండ్ అవుట్ ఫన్ మోడ్ లో తీస్తున్నారని ఇన్ సైడ్ టాక్. నితిన్ తో అనుకుని తర్వాత హీరో మారిన సినిమానే ఇప్పుడు ఆనంద్ దేవరకొండతో చేస్తున్నది.