రాను రాను రాజగుర్రం ఏదో అయ్యిందని పాత సామెత ఒకటుంది. అనిరుధ్ రవిచందర్ ని చూస్తుంటే ఇదే గుర్తొస్తోంది. మొన్నటిదాకా వరస బ్లాక్ బస్టర్లతో ఊపేసిన ఈ మ్యూజిక్ సెన్సేషన్ గత కొంత కాలంగా తన స్థాయికి తగ్గ సంగీతం ఇవ్వలేకపొతున్నాడు. నిర్మాతలు భారీ పారితోషికాన్ని సమర్పించుకుంటూ ఒక్కోసారి డేట్లు దొరక్క విడుదల వాయిదా వేయాల్సి వచ్చినా అన్నింటిని తట్టుకుని మరీ పని చేయించుకుంటున్నారు. అయినా సరే ఫలితాలు రావడం లేదు. సినిమాలు బాగుండకపోవడం తర్వాత విషయం. ముందైతే కాస్త గుర్తుండిపోయే సాంగ్స్, బీజీఎమ్ ఇస్తే కనీసం ఆల్బమ్ అయినా నిలబడుతుంది కదా.
తాజాగా మదరాసి రూపంలో అనిరుధ్ ఖాతాలో మరో యావరేజ్ మూవీ తోడయ్యింది. తమిళ వెర్షన్ వరకు అలా అంటున్నారు కానీ మిగిలిన భాషల్లో మాత్రం ఫ్లాప్ దిశగానే పరుగులు పెడుతోంది. కంటెంట్ తేడాగా ఉన్నా విమర్శకులు ప్రస్తావిస్తున్న మైనసుల్లో అనిరుధ్ పనితనం కూడా ఉంది. బీజీఎమ్ పదే పదే విన్నట్టు అనిపించిందని, ఫ్రెష్ గా లేదనే కామెంట్స్ ఎక్కువ వచ్చాయి. పాటలు కూడా మరీ తీవ్రంగా వైరల్ కాలేదు. మౌనికా సాంగ్ మినహాయించి కూలికి చేసిన వర్క్ పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయింది. దీని వెనుక కింగ్డమ్, విడాముయార్చి, వెట్టయన్ అన్నింటిది ఒకే కథ. దేవర ఒక్కటే మినహాయించాల్సి ఉంటుంది.
ఇలా అయితే అనిరుద్ తనను తాను రిస్కు లో పడేసుకున్నట్టే. ఇప్పటికీ చేతి నిండా సినిమాలున్నాయి ప్రదీప్ రంగనాదన్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, రజనీకాంత్ జైలర్ 2, నాని ది ప్యారడైజ్, గౌతమ్ తిన్ననూరి మేజిక్, విజయ్ జన నాయకుడు, షారుఖ్ ఖాన్ కింగ్ ఇలా క్రేజీ ప్రాజెక్టులు క్యూ కట్టుకున్నాయి. ఇవన్నీ జస్ట్ ఏడాది కాలంలోనే రిలీజైపోతాయి. వీటిద్వారా మళ్ళీ తానేంటో ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత అనిరుధ్ మీద ఉంది. ఊరికే హోరెత్తే నేపధ్య సంగీతం, పాటలు కాకుండా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే మ్యూజిక్ ఇమ్మని సంగీత ప్రియులు కోరుతున్నారు. మరి అనిరుధ్ పాత కసితో పని చేస్తాడో లేదో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates