పుష్పగా మారిన పృథ్విరాజ్… ఎందుకంటే

సలార్ తో మనకు దగ్గరైన మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ ప్రస్తుతం ఎస్ఎస్ఎంబి 29లో నటిస్తున్న సంగతి తెలిసిందే. తన పాత్రకు ప్రాధాన్యం ఉంటే తప్ప ఇతర బాషల సినిమాలు అంగీకరించని ఈ వర్సటైల్ యాక్టర్ కొత్త మూవీ ‘విలాయత్ బుధా’ త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. తెలుగుతో పాటు ప్యాన్ ఇండియా లాంగ్వేజెస్ లో టీజర్ ని లాంచ్ చేశారు. అయితే ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ షాట్ దాకా అచ్చం పుష్ప పోలికల్లో ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం. అంతేకాదు ఒక సీన్ లో హీరోని ఉద్దేశించి పోలీస్ ఆఫీసర్ నువ్వేమైనా పుష్పా అనుకుంటున్నావాని అడిగితే దానికి పృథ్విరాజ్ అతను ఇంటర్నేషనల్ నేను లోకల్ అంటాడు.

ఇంత దగ్గరగా పోలి ఉండే థీమ్ ని పృథ్విరాజ్ ఎందుకు ఎంచుకున్నాడనే సందేహం వస్తోంది కదూ. అక్కడికే వద్దాం. 2020లో జిఆర్ ఇందు గోపాలన్ అనే మలయాళీ రచయిత విలాయత్ బుధా అనే నవల రాశాడు. ఇది బాగా హిట్టయ్యింది. వేలు లక్షల్లో పుస్తకాలు అమ్ముడుపోయాయి. అందులో మెయిన్ పాయింట్ ఏంటంటే ఒక స్కూల్ టీచర్ అరుదైన, ఖరీదైన ఎర్రచందనం చెట్టుని తన వసారాలో పెంచుతాడు. కోట్లు విలువ చేసే తోట మీద కన్నేసిన ఒక స్మగ్లర్ ఎలాగైనా దాన్ని కొట్టేసి సొమ్ము చేసుకోవాలనుకుంటాడు. వీడెవరో కాదు ఆ మాస్టారుకి స్టూడెంటే. ఇద్దరి మధ్య మొదలైన యుద్ధం ఊరికి, మాఫియాకు పాకుతుంది.

ఆ మరుసటి ఏడాది 2021లో పుష్ప 1 ది రైజ్ వచ్చింది. స్టోరీ పరంగా రెండింటికి పోలికలు లేవు కాబట్టే ఎలాంటి వివాదం రాలేదు. కేవలం హీరో గెటప్, ఎర్రచందనం మాఫియా మాత్రమే దగ్గరగా అనిపిస్తుంది అంతే. పృథ్విరాజ్ ఇప్పుడీ విలాయత్ బుధాని చేయడానికి కారణం ఇదే. టీజర్ చూసి పోలికలు తెచ్చినా సరే అసలు సినిమా చూశాక ఆడియన్స్ థ్రిల్ అవుతారనే నమ్మకంతో ఉన్నాడు. నవల హక్కులు కొని సినిమా తీశారు. జయం నంబియార్ దర్శకత్వం వహించిన ఈ ఫారెస్ట్ థ్రిల్లర్ కు జేక్స్ బిజోయ్ సంగీతం సమకూర్చారు. రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదు కానీ దీపావళికి విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.