కోన లేడు.. కొడతాడా హిట్టు

దర్శకుడు శ్రీను వైట్ల, రచయిత కోన వెంకట్‌లది ఎలాంటి కాంబినేషనో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. వీరి కలయికలో ఢీ, రెడీ, కింగ్, దూకుడు లాంటి బ్లాక్‌బస్టర్లు వచ్చాయి. ఓ మోస్తరుగా ఆడినా ‘బాద్ షా’ వరకు వీరి కాంబినేషన్ విజయవంతంగా సాగింది. కానీ ఆ సినిమాకు పని చేస్తున్న సమయంలో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి విడిపోయారు.

వైట్ల, కోనల కెరీర్లు తిరగబడింది కూడా అక్కడి నుంచే. ఇద్దరిలో ఎవ్వరూ సరైన విజయాలందుకోలేకపోయారు. శ్రీను వైట్ల పరిస్థితి అయితే మరీ దారుణం. ఆగడు, బ్రూస్‌లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ.. ఇలా ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్ అయ్యాయి అతడి సినిమాలో. ఇందులో ‘బ్రూస్ లీ’ చిత్రానికి బలవంతంగానే కోన కొంత రచనా సహకారం అందించాడు కానీ.. అది కూడా ఫలితాన్నివ్వలేదు. దీంతో ఇద్దరూ తర్వాత విడివిడిగానే సినిమాలు చేసుకుపోతున్నారు. కానీ ఎవ్వరూ విజయాల్లో లేరు.

ఇప్పుడు శ్రీను వైట్ల ‘ఢీ’ సీక్వెల్ ‘డి అండ్ డి’ తీయడానికి సిద్ధమయ్యాడు. ‘ఢీ’లో నటించిన మంచు విష్ణునే హీరో. ‘ఢీ’ తరహాలోనే ఇది కూడా కామెడీ ఎంటర్టైనర్ లాగా కనిపిస్తోంది. ‘ఢీ’కి పని చేసిన గోపీమోహన్ దీనికీ రచనా సహకారం అందిస్తున్నాడు. కానీ ఇందులో కోన వెంకట్ పేరు మాత్రం మిస్సవుతోంది. కామెడీ రాయడంలో, ఎవర్ గ్రీన్ కామెడీ క్యారెక్టర్లు సృష్టించడంలో కోన ప్రతిభ ఎలాంటిదో అందరికీ తెలిసిందే.

కానీ వైట్లతో విభేదాల వల్ల కావచ్చు, చివరగా అతడితో కలిసి చేసిన సినిమా సరైన ఫలితాన్నివ్వకపోవడం వల్ల కావచ్చు.. కోన కామెడీ ఔట్ డేట్ అయిపోవడం వల్ల కావచ్చు.. ‘డి అండ్ డి’కు అతను పని చేయట్లేదు. ఆయన స్థానంలో కిషోర్ గోపు అనే వేరే రచయిత వర్క్ చేస్తున్నాడు. కోనతో కెమిస్ట్రీ కుదిరినంత వరకు వైట్ల విజయాలందుకున్నాడు. ఆ తర్వాతే గాడి తప్పాడు. మరి వైట్ల ఈసారైనా కోన లేకుండా హిట్టు కొట్టగలనని రుజువు చేస్తాడా.. ప్రమాదకర స్థాయిలో ఉన్న తన కెరీర్‌ను నిలబెట్టుకుంటాడా అన్నది చూడాలి.