కూలీ ఫేటు… 28 రోజులకే ఓటిటి రూటు

2025 చాలా క్రేజీ కాంబినేషన్ ఉన్న మల్టీస్టారర్ గా హైప్ తెచ్చుకున్న కూలీ అంచనాలు అందుకోలేకపోవడం రజనీకాంత్ ఫ్యాన్స్ ఇప్పట్లో మర్చిపోలేరు. ఏదో ఆషామాషీ దర్శకుడైతే అంతగా ఫీలవ్వాల్సిన పనుండేది కాదు కానీ లోకేష్ కనగరాజ్ బ్రాండ్ విపరీతమైన హైప్ తీసుకొచ్చింది. తెలుగు హక్కులు ఎప్పుడూ లేని విధంగా 50 కోట్లు పలకడం ఒక రికార్డు. దెబ్బకు టికెట్ రేట్లు పెంచుకుని మరీ కలెక్షన్లు తెచ్చుకోవాల్సి వచ్చింది. కట్ చేస్తే ఆగస్ట్ 14 విడుదలైన కూలీ అప్పుడే ఓటిటిలో వస్తోంది. సెప్టెంబర్ 11 నుంచి అన్ని ప్రధాన భాషల్లో(హిందీ మినహాయించి) స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు అమెజాన్ ప్రైమ్ అధికారికంగా ప్రకటించింది.

అంటే సరిగ్గా 28 రోజులకు డిజిటల్ లో వచ్చేస్తోంది. అసలే ఒక పక్కా జనాలు థియేటర్లకు సరిగా రావడం లేదని డిస్ట్రిబ్యూటర్లు గగ్గోలు పెడుతుంటే రజనీకాంత్, నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర లాంటి స్టార్లున్న ఇంత పెద్ద మూవీని కేవలం నాలుగు వారాలకు పరిమితం చేయడం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ సంబరానికి నాలుగైదు వందలు పెట్టి టికెట్లు కొనడం ఎందుకనే ఆలోచన ఆడియన్స్ కి రావడానికి కారణం ఇదే. వరల్డ్ వైడ్ గ్రాస్ అయిదు వందల కోట్ల దాకా వసూలు చేసిన కూలీ నిజానికి పెట్టుకున్న టార్గెట్ వెయ్యి కోట్లు. కోలీవుడ్ కలగా మిగిలిన ఈ మార్క్ అందుకుంటుందని అందరూ భావించారు.

కానీ సగం దూరంలోనే కూలీ ఆగిపోయింది. తెలుగులో ఆల్రెడీ ఫైనల్ రన్ కు వచ్చేయగా తమిళంలో ఎదురీదుతోంది. లోకేష్ కనగరాజ్ ఈ మధ్యే బయటికి వచ్చి అంచనాలు పెట్టుకోవడం జనాల తప్పన్నట్టు కవర్ చేసే ప్రయత్నం చేయడం సోషల్ మీడియాలో రివర్స్ అయ్యింది. తప్పు తన వైపు పెట్టుకుని చూసేవాళ్ళ మీద నింద వేయడం కామెడీ. లియో టైంలోనూ విమర్శకులు ఎదురుకున్న లోకేష్ హీరో విజయ్ పుణ్యమాని ఫ్లాప్ తప్పించుకున్నాడు. కానీ కూలీ విషయంలో అది రివర్స్ అయ్యింది. ఈసారి దొరికిపోయాడు. అన్నట్టు రజనీకాంత్ – కమల్ హాసన్ కాంబోలో మూవీ ప్రచారం జరిగింది కానీ ఇప్పటిదాకా దాని ఊసులేదు.