చూస్తుండగానే 100 కోట్లు లాగేసింది

మొన్నటిదాకా మీడియా సర్కిల్స్ లోనూ పెద్దగా బజ్ లేని సినిమా కొత్త లోక. దుల్కర్ సల్మాన్ నిర్మాతగా రూపొందిన ఈ ఫాంటసీ హారర్ డ్రామాలో కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ పోషించిన సంగతి తెలిసిందే. ఒక మోస్తరు అంచనాలతో రిలీజైన లోక (ఒరిజినల్ పేరు) కేవలం వారం లోపే వంద కోట్ల గ్రాస్ దిశగా అడుగులు వేయడం మల్లువుడ్ జనాలను ఆశ్చర్యపరుస్తోంది. ఇంత వేగంగా హండ్రెడ్ క్రోర్స్ అందుకున్న వాటిలో ఎల్ 2 ఎంపురాన్, తుడరమ్ తర్వాత స్థానాన్ని ఆక్రమించుకుంది. మమ్ముట్టి భీష్మ పర్వాన్ని ఇంత తక్కువ గ్యాప్ లో క్రాస్ చేయడం ఎవరూ ఊహించలేదు. కేరళలో లోక స్ట్రాంగ్ గా రన్ అవుతోంది.

తెలుగు వర్షన్ విషయానికి వస్తే ఒక రోజు ఆలస్యంగా రిలీజైనా ఇప్పటిదాకా సుమారు ఆరు కోట్ల దాకా గ్రాస్ నమోదు చేసినట్టు బయ్యర్ రిపోర్ట్. ఇది షాకింగ్ ఫిగరే. ఎందుకంటే కొన్ని మీడియం రేంజ్ స్ట్రెయిట్ సినిమాలు ఇందులో సగం తెచ్చుకోవడానికే కిందా మీద పడుతున్నాయి. సుందరకాండకు మంచి టాక్ వచ్చినా అది వసూళ్లుగా మారకపోవడం సదరు టీమ్ కు అంతు చిక్కడం లేదు. కొత్త లోక దెబ్బకే తన త్రిబాణధారి బార్బరీక్ ని జనం పట్టించుకోలేదనే రీతిలో ఆ దర్శకుడు చేసిన వీడియో బాగా వైరల్ అయ్యింది. ఈ లెక్కన కొంచెం డ్రైగా ఉన్న టైంలో కొత్త లోక చేసింది ఒకరకంగా సంచలనం లాంటిదే.

ఈ వారం ఘాటీ, లిటిల్ హార్ట్స్, మదరాసి వస్తున్నాయి కాబట్టి కొత్త లోక రెండో వారం రన్ ఎలా ఉంటుందనేది వాటి టాక్స్ మీద ఆధారపడి ఉంటుంది. కేరళలో ఈ టెన్షన్ లేదు. ఎందుకంటే ఇప్పట్లో దీనికి కాంపిటీషన్ వచ్చే మూవీ ఏదీ లేదు. తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సి రావొచ్చు. ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాల్లో అత్యధిక గ్రాస్ సాధించిన సినిమాలుగా పేరున్న మహానటి, రుద్రమదేవి, అరుంధతి, భాగమతి సరసన లోక చేరొచ్చని విశ్లేషకులు ముందుగా అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా ప్రొడ్యూసర్ గా దుల్కర్ సల్మాన్  అందరూ షాకయ్యే చాలా పెద్ద జాక్ పాట్ కొట్టాడు.