అనుష్కతో క్రిష్ ‘సరోజ’ తీద్దామనుకుని…

తెలుగులో మంచి అభిరుచి ఉన్న దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడి ఒకడు. తొలి చిత్రం ‘గమ్యం’తోనే తాను చాలా ప్రత్యేకమైన దర్శకుడినని ఆయన చాటారు. ఆ తర్వాత వేదం, కృష్ణం వందే జగద్గురుం, కంచె, గౌతమీపుత్ర శాతకర్ణి.. ఇలా ప్రతి సినిమాతోనూ తనదైన ముద్ర వేశారు. ఇప్పుడు ‘ఘాటి’తో ఆయన ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ‘వేదం’ తీసిన దశాబ్దంన్నర తర్వాత ఆయన మళ్లీ అనుష్క ప్రధాన పాత్రలో సినిమా తీశారు. 

నిజానికి స్వీటీతో ఆయన ఎప్పుడో రెండో సినిమా తీయాల్సిందట. ‘వేదం’ చిత్రానికి హైలైట్‌గా నిలిచిన సరోజ పాత్ర మీదే ప్రత్యేకంగా ఒక సినిమా చేయాలని క్రిష్ అనుకున్నాడట. ఆ సినిమా క్లైమాక్స్‌లో సరోజ పాత్ర ఆశగా ప్రపంచం వైపు చూసే షాట్ చూశాక ఆ పాత్ర మీద ఒక సినిమా తీయాలని తాను అనుకున్నట్లు క్రిష్ చెప్పాడు. అనుష్కకు కూడా సరోజ పాత్ర అంటే చాలా ఇష్టమని.. ఆమె కూడా సినిమా చేయడానికి ఆసక్తి చూపించిందని.. ఐతే ఆ పాత్రను టచ్ చేస్తే పాడైపోతుందేమో అని దాని జోలికి వెళ్లలేదని క్రిష్ తెలిపాడు.

ఐతే సరోజ పాత్రకు ఏమాత్రం తీసిపోని విధంగా ‘ఘాటి’లో శీలావతి పాత్ర ఉంటుందని.. ‘వేదం’ తర్వాత మళ్లీ అంత బలమైన కథతో ఈ సినిమా తీశానని క్రిష్ తెలిపాడు. ఈ చిత్రంలో అనుష్క పవర్ ఫుల్ పెర్ఫామెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతారని క్రిష్ ధీమా వ్యక్తం చేశాడు. అనుష్క సినిమా బాగుంది అంటే ప్రేక్షకులు ఎంత గొప్పగా ఆదరిస్తారో గతంలో కొన్ని చిత్రాలు రుజువు చేశాయని.. ‘ఘాటి’ కూడా ఆమె స్టామినాను తెలియజేస్తుందని క్రిష్ అన్నాడు.

లీడ్ రోల్‌కు ‘శీలావతి’ అని పేరు పెట్టడం ఆశ్చర్యం కలిగించి ఉండొచ్చని.. కానీ అలా ఎందుకు పెట్టాం అన్నది సినిమా చూస్తే అర్థమవుతుందని క్రిష్ తెలిపాడు. ఈ సినిమాలో గంజాయిని గ్లోరిఫై చేయడం లాంటిదేమీ జరగలేదని.. దానికి వ్యతిరేకంగానే సినిమా ఉంటుందని క్రిష్ స్పష్టం చేశాడు.