విడుదల ఇంకా చాలా దూరంలో ఉంది. మార్చి 27 అంటే నిక్షేపంగా ఏ సంక్రాంతి నుంచో ప్రమోషన్లు మొదలుపెట్టొచ్చు. కానీ దర్శకుడు బుచ్చిబాబు ఆలోచన వేరేలా ఉంది. దసరా లేదా దీపావళికి ఫస్ట్ ఆడియో సింగల్ లో రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నాడు. ఇంత తొందరగా ఎందుకయ్యా అంటే దాని వెనుకో మాస్టర్ ప్లాన్ ఉందట. ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన పాటలు అద్భుతంగా వచ్చాయని ఇన్ సైడ్ టాక్. ముఖ్యంగా చరణ్ సోలోగా కనిపించే టైటిల్ ట్రాక్ ఛార్ట్ బస్టర్ అవుతుందనే ఫీడ్ బ్యాక్ యూనిట్ సభ్యుల నుంచి వినిపిస్తోంది. నెలల తరబడి ట్రెండింగ్ లో ఉండే అవకాశం పుష్కలంగా ఉందని అంటున్నారు.
సో ఆరు నెలల ముందే దాన్ని వదలడం ద్వారా పెద్దికి మరోసారి నేషన్ వైడ్ అటెన్షన్ తీసుకురావొచ్చనేది బుచ్చిబాబు ఆలోచన. టీజర్ లో కేవలం ఒక క్రికెట్ షాట్ తో అంచనాలు అమాంతం పెంచేసిన ఇతనికి ఇప్పుడు సాంగ్ ని ఎలా తీసుకెళ్ళాలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులోనూ మార్కెట్ లో రెహమాన్ మీద ఏమంత పాజిటివ్ వైబ్స్ లేవు. ఒకప్పటి మేజిక్ చేయలేకపోతున్నారని మ్యూజిక్ లవర్స్ ఫీలవుతున్నారు. ఇలాంటి టైంలో ఆయన అసలైన సత్తా చాటే పాట బయటికొస్తే తెలుగులోనే కాదు ఇతర భాషల్లోనూ అదో సెన్సేషన్ అవుతుంది. పెద్ది బజ్ కి మరింత ఆజ్యం పోసినట్టు అవుతుంది.
ఇక్కడ బుచ్చిబాబు వేసుకున్న స్ట్రాటజీలో మరో కోణాన్ని అర్థం చేసుకోవాలి. పెద్దితో ఫేస్ టు ఫేస్ క్లాష్ కి సిద్ధ పడుతున్న నాని ప్యారడైజ్ కు అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఆ ఆల్బమ్ మీద ఎలాంటి అంచనాలు, హైప్ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దానికి ఏ మాత్రం తీసిపోని రీతిలో పెద్దికి రెహమాన్ కంపోజ్ చేశారనే నమ్మకం అభిమానుల్లో కలగాలి. దానికి మొదటి పాట దోహదం చేయాలి. లిరికల్ వీడియోని ప్రత్యేకంగా ఎడిట్ చేయిస్తున్నారని వినికిడి. రంగస్థలంని మించిన కంటెంట్ ఆశిస్తున్న ఫ్యాన్స్ ఆకాంక్షను నూటికి రెండొందల శాతం నెరవేరుస్తానని బుచ్చిబాబు హామీ ఇస్తున్నాడట.
Gulte Telugu Telugu Political and Movie News Updates