మలయాళంలో ఏమో కానీ కొత్త లోక విడుదలకు రెండు రోజుల ముందు వరకు తెలుగులో అస్సలు బజ్ లేదు. ట్రైలర్ వచ్చాక ఒక వర్గం ఆడియన్స్ లో అంచనాలు ఏర్పడ్డాయి కానీ ఏ మేరకు ఆకట్టుకుంటుందనే అనుమానాలు జనాల్లో లేకపోలేదు. టైటిల్ రోల్ పోషించిన కళ్యాణి ప్రియదర్శన్ కి ఇక్కడ పెద్ద ఇమేజ్ లేదు. నిర్మాత దుల్కర్ సల్మాన్ అనే విషయం మన ప్రేక్షకులకు రిజిస్టర్ కాలేదు. సితార సంస్థ డిస్ట్రిబ్యూషన్ తీసుకోవడంతో చెప్పుకోదగ్గ రిలీజ్ దక్కింది. అది కూడా హడావిడిగానే. ఫ్లాట్ స్క్రీన్లు ఉన్న మల్టీప్లెక్సులకు మొదటిరోజు సరైన ప్రింట్ చేరకపోవడంతో తెరకు నాలుగు వైపులా నలుపు మధ్య సినిమా చూశారు.
తర్వాత ఈ సాంకేతిక సమస్యను సరిచేశారు. వసూళ్ల విషయానికి వస్తే పోటీలో ఉన్న స్ట్రెయిట్ సినిమాల కంటే కొత్త లోక చాలా మెరుగ్గా పెర్ఫార్మ్ చేసింది. ఏపీ తెలంగాణ కలిపి సుమారు మూడు కోట్ల దాకా గ్రాస్ వచ్చి ఉండొచ్చని ట్రేడ్ రిపోర్ట్. ఇది చాలా పెద్ద మొత్తం. స్టార్లు లేని ఫాంటసీ మూవీకి ఇంత ఆదరణ దక్కడం మాటలు కాదు. అయితే నగరాలు, పెద్ద పట్టణాల్లో స్ట్రాంగ్ గా ఉన్న కొత్త లోక కింది సెంటర్లలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఆడియన్స్ ని రాబట్టలేకపోతోంది. కంటెంట్ మాస్ కి చేరేది కాకపోవడంతో రీచ్ పరిమితం అవుతోంది. ఈ రోజు సోమవారం నుంచి ఆక్యుపెన్సీలు బాగా తగ్గిన వైనం బుకింగ్స్ లో కనిపిస్తోంది.
రాబోయే శుక్రవారం మూడు చెప్పుకోదగ్గ రిలీజులు ఉండటంతో కొత్త లోకకు ఈ నాలుగు రోజులు కీలకం కానున్నాయి. వీలైనంత రాబట్టుకుని సేఫ్ అయిపోవాలి. బ్రేక్ ఈవెన్ ఎంతనేది చెప్పలేదు కానీ రేపో ఎల్లుండో డీటెయిల్స్ రావొచ్చు. ఒకవేళ కొత్త లోక లేకపోయి ఉంటే మాత్రం నిన్నటి వీకెండ్ మరింత డల్ గా ఉండేది. సుందరకాండ, త్రిబాణధారి బార్బరిక్, అర్జున్ చక్రవర్తి ఆశించిన స్థాయిలో నడవటం లేదు. పాజిటివ్ టాక్ ఉన్నవాటి పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. అయినా సరే డబ్బింగ్ మూవీ కొత్త లోకకు ఈ స్థాయి రెస్పాన్స్ తెలుగులో రావడం విచిత్రమే. మరి జోరు ఎక్కడి దాకో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates