రచయితలకు రైటర్స్ బ్లాక్ అని ఒకటుంటుంది. ఒక మూమెంట్లో వాళ్లు స్ట్రక్ అయిపోయి ఇబ్బంది పడుతుంటారు. కొత్తగా రాయడానికి ఆలోచనలు రావు. అలాంటి సమయంలో తమలో ఉత్సాహం రావడం కోసం కొందరు టీ తాగుతారు. కొందరు నచ్చిన సినిమానో, సన్నివేశమో చూస్తారు. ఏదైనా చదువుతారు. ఐతే తనకు మాత్రం థియేటర్లలో కొన్ని సినిమాలకు ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్ చూస్తే జోష్ వస్తుందని అంటున్నాడు టాలీవుడ్ యువ దర్శకుడు సందీప్ రాజ్. కలర్ ఫొటో చిత్రంతో మంచి గుర్తింపు సంపాదించిన సందీప్.. ప్రస్తుతం సుమ, రాజీవ్ కనకాల తనయుడు రోషన్ కనకాలతో మోగ్లీ అనే సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే.
ఇటీవలే రిలీజైన ఈ సినిమా టీజర్ ఆకట్టుకుంది. కలర్ ఫొటో తర్వాత సందీప్ రాజ్ మళ్లీ మంచి విజయాన్ని అందుకుంటాడనే ఉత్సాహాన్నిచ్చింది ఈ టీజర్. ఈ నేపథ్యంలో మా ప్రతినిధికి ఇచ్చిన ఎక్సక్లూసివ్ ఇంటర్వ్యూలో సందీప్ రాజ్ మాట్లాడుతూ.. తాను డౌన్ అయినపుడు ఏం చేస్తానో వెల్లడించాడు. రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్, ఈగ సినిమాలకు థియేటర్లలో వచ్చిన రియాక్షన్ వీడియోలు చూస్తే తనకు ఎక్కడ లేని ఉత్సాహం వస్తుందన్నాడు.
అప్పటిదాకా డౌన్ అయిన వాడిని అవి చూశాక ఉత్సాహం తెచ్చుకుంటానని చెప్పాడు. తాను ఆ సమయంలో సన్నివేశం చూడనని.. కేవలం ఆడియన్స్ రియాక్షన్స్ మాత్రమే గమనిస్తానని.. అవే తనకు ఇంధనాన్ని ఇస్తాయని.. అవి చూశాక కూర్చుని తర్వాతి సన్నివేశం రాయడం మొదలుపెడతానని సందీప్ రాజ్ తెలిపాడు. ఇండియన్ సినిమాలో థియేటర్లను హోరెత్తించడంలో రాజమౌళి చిత్రాలను మించినవి ఇంకేవీ ఉండవంటే అతిశయోక్తి కాదు. మగధీర, ఈగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలకు వచ్చిన స్పందన అలాంటిలాంటిది కాదు. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ అమెరికాలో సంచలనం రేపింది. మన సినిమాకు యుఎస్ థియేటర్లలో లోకల్ ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన చూస్తే వచ్చే సంతృప్తే వేరు.
Gulte Telugu Telugu Political and Movie News Updates