టాలీవుడ్లో కాస్త వయసు ఎక్కువైనా ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉన్న కథానాయకుల్లో నారా రోహిత్ ఒకడు. ఐతే కొన్ని నెలల ముందే పెళ్లి దిశగా అతను అడుగులు వేశాడు. తనతో ప్రతినిధి-2 సినిమాలో కలిసి నటించిన సిరి లెల్లా అలియాస్ శిరీషతో అతను గత ఏడాది నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ పెళ్లి గురించి మాత్రం ఏ సమాచారం లేదు. తన కొత్త చిత్రం సుందరకాండ ప్రమోషన్లలో భాగంగా గుంటూరు పర్యటనకు వెళ్లిన అతను.. తన వివాహం గురించి అప్‌డేట్ ఇచ్చాడు.
తన పెళ్లి ఈ ఏడాదే ఉంటుందని రోహిత్ వెల్లడించాడు. అక్టోబరు లేదా నవంబరులో తాను శిరీషను పెళ్లాడతానన్నాడు. శిరీష ప్రతినిధి-2 తర్వాత వేరే సినిమాలు ఎందులోనూ నటించలేదు. సుందరకాండలో ఆమె చిన్న క్యామియో చేసింది. ప్రతినిధి-2 కోసం పని చేస్తున్న సమయంలోనే వీరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. ఆ సినిమా విడుదల తర్వాత కొంత కాలానికే వీరి నిశ్చితార్థం జరిగింది. కొన్నేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న రోహిత్.. గత ఏడాదే రీఎంట్రీ ఇచ్చాడు.
ప్రతినిధి-2, భైరవం చిత్రాలు అతణ్ని నిరాశకు గురి చేసినప్పటికీ.. సుందరకాండ ఓ మోస్తరు ఫలితాన్నందుకుంది. ఇందులో కామెడీకి ప్రేక్షకులు బాగానే కనెక్ట్ అవుతున్నారు. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో వీకెండ్లో కుటుంబ ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు మంచి స్పందనే వచ్చింది. ఐతే వారాంతం తర్వాత సినిమా నిలబడే పరిస్థితి కనిపించడం లేదు. మలయాళ అనువాద చిత్రం కొత్త లోక దీన్ని డామినేట్ చేసే సంకేతాలు కనిపిస్తున్నాయి. సుందరకాండ తర్వాత రోహిత్ కొత్త చిత్రం ఏదీ ఇంకా ఖరారవ్వలేదు. పెళ్లి తర్వాతే అతను కొత్త చిత్రాన్ని మొదలుపెట్టేలా ఉన్నాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates