బాలయ్య ఆదిత్య 999పై స్పందించిన క్రిష్

ఆదిత్య 999… నంద‌మూరి బాల‌కృష్ణ డ్రీమ్ ప్రాజెక్టు. త‌న కెరీర్లో ఒక మైల‌రాయిలా నిలిచిపోయిన ఆదిత్య 369కు సీక్వెల్ తీయాల‌ని ఆయ‌న ఎప్ప‌ట్నుంచో అనుకుంటున్నారు. ఆదిత్య 369 ద‌ర్శ‌కుడు సింగీతం శ్రీనివాస‌రావుతోనే ఈ సినిమా కూడా చేయాల‌నుకున్నారు. కానీ ఆయ‌నకు వ‌య‌సు మీద ప‌డింది. ఫామ్ కూడా కోల్పోయారు. ఈ సీక్వెల్‌కు స్టోరీ బోర్డ్‌తో స‌హా స్క్రిప్టు రెడీగా ఉంది. ఒక ద‌శ‌లో బాల‌య్యే స్వ‌యంగా ఈ చిత్రాన్ని రూపొందించాల‌నుకున్నాడు. కానీ త‌ర్వాత ఆ ఆలోచ‌న మానుకున్నాడు.

ఐతే ఈ మ‌ధ్య ద‌ర్శ‌కుడిగా కొత్త పేరు తెర‌పైకి వ‌చ్చింది. బాల‌య్య‌తో గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి తీసిన క్రిష్ పేరును ప‌రిశీలిస్తున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. బాల‌య్య ప్ర‌ధాన పాత్ర పోషించే ఈ చిత్రంలో ఆయ‌న త‌న‌యుడు మోక్ష‌జ్ఞ కూడా న‌టిస్తాడ‌ని అంటున్నారు. ఈ ప్రచారం గురించి క్రిష్‌ను అడిగితే మాత్రం స‌మాధానం ఇవ్వ‌లేదు. త‌న కొత్త చిత్రం ఘాటి ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా ఆదిత్య 999 గురించి అడిగితే.. ఈ సినిమాను ప్ర‌క‌టించాల్సింది బాల‌య్యే అని.. తాను దాని గురించి మాట్లాడ‌లేన‌ని తేల్చేశాడు క్రిష్‌.

ఈ చిత్రంలో మోక్ష‌జ్ఞ న‌టిస్తాడ‌న్న‌ది నిజ‌మా అంటే అది కూడా బాల‌య్యే చెప్పాల‌న్నాడు. ఏదైనా బాల‌య్య నోటి నుంచే వినాల‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశాడు. ఘాటి నిర్మాత అయిన క్రిష్ స్నేహితుడు రాజీవ్ రెడ్డిని ఇంట‌ర్వ్యూలో ఈ ప్రాజెక్టు గురించి అడిగితే.. చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని మాత్ర‌మే చెప్పాడు కానీ అంత‌కుమించి వివ‌రాలు వెల్ల‌డించ‌లేదు. క్రిష్ అయితే ఆ మాత్రం స‌మాచారం కూడా చెప్ప‌లేదు కానీ సినీ వర్గాల సమాచారం ప్రకారం ప్రాజెక్ట్ లాక్ ఐపోయి లాంచ్ కు సిద్ధంగా ఉంది.

ఇక హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు నుంచి త‌ప్పుకోవ‌డం, ఆ సినిమాకు ఆశించిన ఫ‌లితం రాక‌పోవ‌డం గురించి ప్ర‌శ్నిస్తే.. త‌న‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే ఎంతో ప్రేమ అని, నిర్మాత ఏఎం ర‌త్నం అంటే ఎంతో గౌర‌వ‌మ‌ని.. ఐతే షెడ్యూలింగ్ స‌మ‌స్య‌లు, త‌న వ్య‌క్తిగ‌త ఇబ్బందుల వ‌ల్లే ఆ సినిమా నుంచి త‌ప్పుకోవాల్సి వ‌చ్చింద‌ని.. దీంతో జ్యోతికృష్ణ మిగ‌తా భాగం పూర్తి చేశార‌ని.. ఆ సినిమా నుంచి బ‌య‌టికి వ‌చ్చాక త‌న ఫోక‌స్ అంతా ఘాటి మీదే ఉంద‌ని చెబుతూ వీర‌మ‌ల్లు రిజ‌ల్ట్ గురించి ఏమీ కామెంట్ చేయ‌లేదు క్రిష్‌.