సైలెంటుగా సినిమా చుట్టేస్తున్న వర్మ

‘శివ’తో మొదలుపెట్టి రామ్ గోపాల్ వర్మ అనే దర్శకుడు కెరీర్లో తొలి రెండు దశాబ్దాల్లో ఎంత గొప్ప సినిమాలు తీశాడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తొలి సినిమా తర్వాత బాలీవుడ్లోకి అడుగు పెట్టి రంగీలా, సత్య, రాత్, కంపెనీ, సర్కార్ లాంటి చిత్రాలతో సంచలనం రేపాడు. కానీ అక్కడ కొన్ని ఫ్లాపుల తర్వాత టాలీవుడ్‌కు తిరిగొచ్చి నాసిరకం సినిమాలు తీసి తన అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేశాడు. 

ఒక దశలో బి-గ్రేడ్, పోర్న్ సినిమాలు.. పొలిటికల్ ప్రాపగండీ చిత్రాలు స్థాయికి పడిపోయిన వర్మను చూసి జాలిపడడం తప్ప ఏమీ చేయలేకపోయారు ఫ్యాన్స్. ఇలాంటి సినిమాలు తీస్తున్నారేంటి అని ఎవరైనా అడిగితే.. నచ్చితే చూడండి లేదంటే లేదు, నాపై అంచనాలు పెట్టుకోవడం మీ తప్పు అంటూ విడ్డూరమైన ప్రశ్నలు వేసి తన అభిమానులను పూర్తిగా దూరం చేసుకున్నాడు వర్మ. ఇక మళ్లీ వర్మ సినిమా కోసం థియేటర్లకు ఎవ్వరూ వెళ్లరనే ఫీలింగ్ కలిగించాయి చివరగా ఆయన చేసిన కొన్ని చిత్రాలు.

ఐతే ఈ మధ్య వర్మకు జ్ఞానోదయం కలిగి.. తాను చేసిన తప్పులకు సారీ చెప్పి, ఇకపై మంచి సినిమాలే తీస్తానంటూ ఒక నోట్ రిలీజ్ చేయడం గుర్తుండే ఉంటుంది. ఆ సమయంలోనే ఆయన ‘సిండికేట్’ అనే భారీ చిత్రాన్ని అనౌన్స్ చేశాడు. కానీ తర్వాత ఆ సినిమా గురించి ఏ అప్‌డేట్ లేదు. ఐతే ఆ చిత్రాన్ని మొదలుపెట్టడానికి ముందే వర్మ సైలెంటు‌గా ఓ సినిమాను చుట్టేస్తున్నాడు. ఒకప్పుడు తాను అనేక ప్రయోగాలు చేసిన హార్రర్ జానర్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. 

‘సత్య’తో తాను బ్రేక్ ఇచ్చిన మనోజ్ బాజ్‌పేయిని ఇందులో లీడ్ రోల్‌కు తీసుకున్నాడు వర్మ. గత కొన్నేళ్లలో ఆర్జీవీ ఎంత పేలవమైన సినిమాలు తీశాడో మనోజ్‌కు తెలియకుండా ఉండదు. కానీ తన కెరీర్‌ను మార్చేసిన వర్మ మీద ఆయనకు కృతజ్ఞతా భావంతోనే ఈ సినిమా చేస్తుండొచ్చు. మరి ఆర్జీవీ ఈ సినిమాలో ఒకప్పటి మెరుపులు చూపిస్తాడా.. మళ్లీ ఓ హిట్ కొడతాడా అన్నది చూడాలి. ఇది ఆడితేనే ‘సిండికేట్’ అనే భారీ సినిమా చేయడానికి కావాల్సిన వనరులు సమకూరుతాయి.