కొద్దిరోజుల క్రితం వరకు ఓజి వర్సెస్ అఖండ 2 ఉంటుందనే చర్చలే మూవీ లవర్స్ మధ్య జరిగాయి. సెప్టెంబర్ 25 ముందు లాక్ చేసుకుంది బాలయ్య టీమ్ కాబట్టి వెనక్కు తగ్గే ప్రసక్తి ఉండదనుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ బృందం తమకూ ఆ డేట్ కావాలని ఫిక్స్ అయిపోవడంతో పోటీ రసవత్తరంగా మారింది. తాజా పరిణామాలు అఖండ 2ని వాయిదా వేయించాయి. 14 రీల్స్ సంస్థ అధికారికంగా వదిలిన ప్రకటనలో సాంకేతిక కారణాలు, పోస్ట్ ప్రొడక్షన్ వల్ల నిర్ణయం మార్చుకోక తప్పడం లేదంటూ పేర్కొన్నారు. దర్శకుడు బోయపాటి శీను దసరాని టార్గెట్ చేసుకునే ఇప్పటిదాకా పనులు వేగవంతం చేశారు.
ఇప్పుడు వార్ వన్ సైడ్ అయిపోయింది. బరిలో పవన్ కళ్యాణ్ ఒక్కరే ఉండబోతున్నారు. ఓజికి ఉన్న హైప్ దృష్ట్యా ఎన్ని థియేటర్లు వేసినా తక్కువ వచ్చేలా ఉన్నాయి. ఇప్పుడు ఎలాగూ అఖండ 2 తప్పుకుంది కాబట్టి దానికోసం అగ్రిమెంట్లు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న స్క్రీన్లన్నీ ఆటోమేటిక్ గా ఓజికి వచ్చేస్తాయి. హరిహర వీరమల్లు తరహాలో ఓజికి బజ్ సమస్య లేదు. టి షర్టులు పెట్టినా అమ్ముడుపోతున్నాయి. ఓవర్సీస్ లో ఆన్ లైన్ టికెట్లు పెట్టడం ఆలస్యం క్షణాల్లో సోల్డ్ అవుట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓజికి వీలైనంత పెద్ద రిలీజ్ దక్కడం ఓపెనింగ్స్ పరంగా చాలా ప్లస్ అవుతుంది.
అఖండ కొత్త డేట్ ఏంటనేది అనౌన్స్ మెంట్ లో చెప్పలేదు కానీ రాజా సాబ్ వదులుకున్న డిసెంబర్ 5 దాదాపు ఖరారైనట్టే. ఓటిటి డీల్ తో పాటు ఫైనల్ కాపీ ఎప్పుడు సిద్ధమవుతుందనే దాని మీద నిర్ణయం తీసుకుని అప్పుడు ఫిక్స్ చేస్తారు. ప్రస్తుతం రీ రికార్డింగ్, ఎడిటింగ్ లాంటి హఠాత్తుగా తీసుకునే ఒత్తిళ్లు లేవు కాబట్టి దర్శకుడు బోయపాటి శీను మరింత సమయాన్ని విఎఫ్ఎక్స్ పనుల మీద పెట్టబోతున్నారు. అఖండకు పదింతలు గ్రాండియర్ నెస్ ఈ సీక్వెల్ లో ఉంటుందని టీమ్ తెగ ఊరిస్తోంది. ఇక గ్రౌండ్ ఖాళీ అయ్యింది కాబట్టి పవన్ కళ్యాణ్ ఎన్ని సెంచరీలు కొట్టబోతున్నారో చూడాలి. ఇంకో 27 రోజులే బాకీ.
Gulte Telugu Telugu Political and Movie News Updates