ఈ మధ్య టికెట్ రేట్ల హైక్ అనేది చాలా మాములు విషయమైపోయింది. అనుమతులు తెచ్చుకోవడం ప్రొడ్యూసర్లు ఎంత సాధారణంగా భావిస్తున్నారో, టాక్ యావరేజ్ ఉన్నా సరే సినిమాలకు దూరంగా ఉండటం ప్రేక్షకులు అలాగే అలవాటు చేసుకున్నారు. ఈ ప్రభావం గత రెండు మూడు నెలల్లో ప్యాన్ ఇండియా మూవీస్ మీద తీవ్రంగా పడింది. పోనీ ఫలితం వచ్చాకైనా తగ్గించే చొరవ తీసుకుంటారా అంటే అదీ జరగడం లేదు. కానీ నిర్మాత టిజి విశ్వప్రసాద్ ఒక మంచి ట్రెండ్ కి శ్రీకారం చుట్టేలా ఉన్నారు. ఇవాళ జరిగిన మిరాయ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ ఆడియన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు.
మీడియా ఇంటరాక్షన్ లో భాగంగా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ మిరాయ్ కు ఎలాంటి పెంపులు తీసుకోమని, దేశమంతా ఇప్పుడున్న రేట్లనే ఫాలో అవుతామని చెప్పడం మంచి శుభవార్త. కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే హనుమాన్ సంక్రాంతికి వచ్సినప్పుడు ఎలాంటి హైక్స్ తీసుకోలేదు. దీనివల్ల పోటీలో మహేష్ బాబు, నాగార్జున, వెంకటేష్ లాంటి దిగ్గజాలు ఉన్నా కంటెంట్ తో గెలిచేసింది. సాధారణ ధరలు కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ పోటెత్తారు. ఫలితంగా రికార్డులు బద్దలయ్యే బ్లాక్ బస్టర్ నమోదయ్యింది. ఇప్పుడు మిరాయ్ కు కూడా అదే స్ట్రాటజీని ఫాలో కావడం అత్యుత్తమ నిర్ణయమని చెప్పాలి.
సెప్టెంబర్ 12 విడుదల కాబోతున్న మిరాయ్ కి ట్రైలర్ రెస్పాన్స్ అదిరిపోయింది. ఊహించని స్థాయిలో విజువల్స్ ఆకట్టుకున్నాయని మూవీ లవర్స్ అభిప్రాయపడుతున్నారు. ఓపెనింగ్స్ కి గ్యారెంటీ ఇస్తూ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని చూపించిన శాంపిల్ కంటెంట్ జనాలకు బాగా కనెక్ట్ అయిపోయింది. విఎఫెక్స్ విషయంలో బెస్ట్ ఇచ్చామని, కావాలంటే ఫ్రేమ్ టు ఫ్రేమ్ చెక్ చేసుకోమని చెబుతున్న విశ్వప్రసాద్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే మిరాయ్ ఓ రేంజ్ లో వచ్చినట్టే ఉంది. ఓజికి సరిగ్గా రెండు వారాల ముందు వస్తున్న మిరాయ్ గత మూడు నెలలుగా డ్రైగా ఉన్న టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఊపు తెస్తుందని బయ్యర్ల నమ్మకం.
Gulte Telugu Telugu Political and Movie News Updates