అఖండ 2 ప్రోగ్రెస్ ఎక్కడిదాకా వచ్చింది

నందమూరి అభిమానులు విపరీతమైన ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్న అఖండ 2 విడుదల సెప్టెంబర్ 25 ఉండదనే క్లారిటీ దాదాపు వచ్చినట్టే. నిజానికి ఈ డేట్ ని ఎలాగైనా చేరుకోవాలనే లక్ష్యంతో దర్శకుడు బోయపాటి శీను తన రెగ్యులర్ స్టైల్ ని పక్కనపెట్టి మరీ షూటింగ్ వేగంగా చేశారు. బాలకృష్ణ పూర్తిగా సహకరించి సకాలంలో డబ్బింగ్ కూడా అయిపోగొట్టేసి టీమ్ కి టెన్షన్ లేకుండా చేశారు. అయినా సరే పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు విఎఫెక్స్ వర్క్స్ ఇంకా పెండింగ్ ఉండటంతో ఒత్తిడి తీసుకోవడం ఇష్టం లేక వాయిదా నిర్ణయం తీసుకున్నారని ఇన్ సైడ్ టాక్. కొత్త డేట్ ఇంకా ప్రకటించలేదు.

అదే రోజు ఓజి ఉంది కాబట్టి పోస్ట్ పోన్ చేస్తున్నారనే ప్రచారంలో నిజం లేదనేది యూనిట్ చెబుతున్న మాట. దసరా సెలవులు ఉంటాయి కాబట్టి క్లాష్ ఉన్నా లేకపోయినా అఖండ 2 చూసే ఆడియన్స్ శాతం ఎంత మాత్రం తగ్గిపోదని అంటున్నారు. సరే దీని సంగతలా ఉంచితే రాజా సాబ్ వదులుకోబోయే డిసెంబర్ 5న అఖండ 2 రావొచ్చనే ప్రచారానికి ఇంకా అధికారిక ముద్ర పడాల్సి ఉంది. ఎలాగూ 2026 సంక్రాంతి ప్యాక్ అయిపోయింది కాబట్టి అప్పటిదాకా ఆగే ఛాన్స్ లేదు. పుష్ప 2, యానిమల్, అఖండ గతంలో డిసెంబర్ లోనే వచ్చి బ్లాక్ బస్టర్లు సాధించి రికార్డులు తుడిచిపెట్టాయి. సో అది ఖచ్చితంగా మంచి ఆప్షనే.

ప్రమోషన్లు మాత్రం అఖండ 2కి ఇప్పట్లో మొదలుపెట్టేలా లేరు. ఒకవేళ డిసెంబర్ అయితే ఇంకా చాలా టైం ఉంది కాబట్టి వెయిట్ చేస్తారు. తమన్ పాటలు ఇంకా బయటికి రాలేదు. ఈసారి అదిరిపోయే ఆల్బమ్ ఉంటుందని ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ డివోషనల్ యాక్షన్ డ్రామాలో ఆది పినిశెట్టి విలన్ గా నటించాడు. రషెస్ చూసిన వాళ్ళు కంటెంట్ టెర్రిఫిక్ గా ఉందని, అఖండని మించి విజువల్స్ అదిరిపోయాయని అంటున్నారు. అదే నిజమైతే మాత్రం బాలయ్య విశ్వరూపానికి ఈసారి ఎలాంటి రికార్డులు బద్దలు కాబోతున్నాయో చూడాలి.