కన్నడ స్టార్ హీరో దర్శన్.. తన అభిమానే అయిన రేణుక స్వామి అనే వ్యక్తిని తన బృందంతో కలిసి దారుణంగా హింసించి హత్య చేయించినట్లు అభియోగాలు ఎదుర్కోవడం గత ఏడాది ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. ఈ హత్యలో దర్శన్ స్వయంగా పాల్గొన్నట్లు ఆధారాలు ఉండడంతో అతను జైలు పాలయ్యాడు. ఐతే ఆరు నెలలు తిరిగేసరికే అతను రెగ్యులర్ బెయిల్ మీద బయటికి వచ్చేశాడు. ఈ హత్య చేయించింది దర్శనే అని.. స్వయంగా అతనే రేణుకాస్వామిని హింసించాడని ఆధారాలున్నా… ఎఫ్ఐఆర్‌లో పోలీసులు స్పష్టంగా పేర్కొన్నా.. దర్శన్‌కు బెయిల్ రావడం ఆశ్చర్యానికి గురి చేసింది.
ఇటీవల ఇదే విషయమై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం.. దర్శన్ బెయిల్ రద్దు చేయాలని ఆదేశించడంతో అతను తిరిగి జైలుకు వెళ్లక తప్పలేదు. దీంతో దర్శన్ కుటుంబ సభ్యులు, అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. దర్శన్ బెయిల్ మీద బయటికి వచ్చాక పెండింగ్‌లో ఉన్న డెవిల్ సినిమాను పూర్తి చేశాడు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేయాల్సి ఉంది. అవి పూర్తి చేసి సినిమా ప్రమోషన్లలోనూ పాల్గొనడానికి రెడీ అవుతుండగా.. దర్శన్ బెయిల్ రద్దయింది. దీంతో డెవిల్ సినిమా పరిస్థితి ఏంటా అని అంతా అనుకున్నారు.
ఐతే దర్శన్ అందుబాటులో లేకపోయినా ఆ చిత్రాన్ని విడుదల చేయడానికి టీం రెడీ అయిపోయింది. డిసెంబరు 12న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తాజాగా నిర్మాతలు ప్రకటించారు. దర్శన్ తిరిగి జైలుకు వెళ్లిన రోజు.. అతడి భార్య తన ట్విట్టర్ అకౌంట్‌ను తన చేతుల్లోకి తీసుకున్నారు. దర్శన్ మళ్లీ తిరిగి వస్తాడని.. అంత వరకు ఈ హ్యాండిల్ బాధ్యతలు తనవే అని.. దర్శన్ సినిమాల అప్‌డేట్స్ కూడా దీన్నుంచే వస్తాయని పేర్కొంది.
ఆ హ్యాండిల్‌లోనే డెవిల్ రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. బెయిల్ రద్దుకు ముందు సుప్రీం కోర్టు వ్యాఖ్యల్ని బట్టి చూస్తే.. దర్శన్ ఇప్పుడిప్పుడే తిరిగి బయటికి వచ్చేలా కనిపించడం లేదు. అతను లేకుండానే డెవిల్ సినిమా రిలీజ్ కాబోతోంది. మరి హీరో ప్రమోషన్లలో పాల్గొనకుండా సినిమాకు ఎలాంటి రీచ్ ఉంటుందో.. హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటూ జైల్లో ఉన్న హీరో సినిమాను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి. పునీత్ రాజ్ కుమార్ హీరోగా మిలన్ అనే బ్లాక్ బస్టర్ మూవీని డైరెక్ట్ చేసిన ప్రకాష్ అనే దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates