భారీ అంచనాలు మోసుకొచ్చి తీరా అసలు కంటెంట్ తో ప్రేక్షకులను పూర్తిగా సంతృప్తిపరచక లేకపోయిన కూలీ నిన్న మొన్న వీకెండ్ ని బాగానే వాడుకుంది. మహావతార్ నరసింహ తర్వాత బుకింగ్స్ విషయంలో ట్రెండింగ్ లో ఉండటం ఫ్యాన్స్ కి కొంత తెరిపి నిచ్చే అంశం. అన్ని భాషలు కలిపి ఇప్పటిదాకా కూలీ గ్రాస్ 470 కోట్లను దాటేసిందట. అయితే బ్రేక్ ఈవెన్ గా పెట్టుకున్న 600 కోట్లను టచ్ చేయడం కష్టమనిపించేలా ఉంది. ఒకవేళ ఆ మార్కు అందుకోకపోతే తమిళ వెర్షన్ ని సైతం ఫ్లాప్ గానే పరిగణించాల్సి ఉంటుంది. శివకార్తికేయన్ మదరాసి ఇంకా పది రోజుల దూరంలో ఉంది కాబట్టి ఛాన్స్ అయితే ఉంది.
సెన్సార్ ఇచ్చిన ఏ సర్టిఫికెట్ ని సవాలు చేస్తూ ఇటీవలే కోర్టుకి వెళ్లిన సన్ పిక్చర్స్ త్వరలో కొన్ని మార్పులు చేసి అదనపు సీన్ లేదా ఎపిసోడ్ ఒకటి జోడించి మళ్ళీ ప్రమోషన్లు చేసే ఆలోచనలో ఉందట. అదే జరిగితే తమిళనాడులో మళ్ళీ పికప్ అవుతుందనే నమ్మకంతో ఆ మేరకు దర్శకుడు లోకేష్ కనగరాజ్ అదే పనిలో ఉన్నట్టు చెన్నై టాక్. అప్పుడు యు/ఏ తీసుకోవచ్చు కనక పిల్లల ఆక్యుపెన్సీలతో థియేటర్లు మళ్ళీ నిండుతాయని ఆశిస్తున్నారు కాబోలు. అయితే ఇది అనుకున్నంత ఈజీ కాదు. ఇలా చేసినంత మాత్రాన హఠాత్తుగా మిక్స్డ్ టాక్ పాజిటివ్ గా మారిపోవడం అసాధ్యం. ఏదైనా మేజిక్ జరగాలి.
తెలుగుతో సహా ఇతర భాషల్లో కూలీ ఇంకా లాభాల్లోకి అడుగు పెట్టలేదు. ఏపీ తెలంగాణ యాభై కోట్లకు జరిగిన బిజినెస్ ని తగ్గట్టు వసూళ్లు నమోదు కాలేదు. కాకపోతే వార్ 2 కంటే చాలా మెరుగ్గా మంచి నెంబర్లు నమోదు చేయడం విశేషం. ఆగస్ట్ 29 చెప్పుకోదగ్గ రిలీజులు ఏ భాషలోనూ లేవు. హిందీలో జాన్వీ కపూర్ పరం సుందరి ఒకటే ఉంది. సో కూలి ఇంకొంచెం స్టడీనెస్ కొనసాగిస్తే బయ్యర్లు గట్టెక్కుతారు. పబ్లిసిటీ సంగతి ఎలా ఉన్నా రిలీజ్ తర్వాత శృతి హాసన్, సత్యరాజ్ తప్ప రజని, లోకేష్, నాగార్జున, సౌబిన్ సాహిర్ లు బయట ప్రమోషన్లు కానీ ఇంటర్వ్యూలు ఇవ్వడం కానీ చేయలేదు. లోగుట్టు ఏమిటో పెరుమాళ్ళకెరుక.
Gulte Telugu Telugu Political and Movie News Updates