సీన్ రివ‌ర్స్… హ‌క్కుల కోసం ఓటీటీల పోటీ

కొవిడ్ టైంలో థియేట‌ర్లు మూత‌ప‌డి ప్రేక్ష‌కులు ఇళ్ల‌కు ప‌రిమిత‌మైన స‌మ‌యంలో ఓటీటీ సంస్థ‌లు విజృంభించాయి. ఫ్యాన్సీ రేట్లు ఇచ్చి సినిమాల‌ను కొని నేరుగా రిలీజ్ చేశాయి. అంతే కాక థియేట‌ర్ల‌లో వ‌చ్చిన సినిమాల‌ను కూడా త్వ‌ర‌గా డిజిట‌ల్ రిలీజ్ చేయ‌డం ద్వారా ఆద‌ర‌ణ పెంచుకున్నాయి. రెండు మూడేళ్ల పాటు ఓటీటీల‌న్నీ సినిమాల‌కు మంచి మంచి రేట్లు ఇచ్చేవి. క్రేజున్న సినిమాల‌ డిజిట‌ల్ హ‌క్కుల కోసం వాటి మ‌ధ్య పోటీ ఉండేది. ఓ మోస్త‌రు సినిమాల‌న్నింటికీ ఈజీగా డిజిట‌ల్ హ‌క్కులు అమ్ముడ‌య్యేవి. కానీ గ‌త రెండేళ్ల‌లో క‌థ మారిపోయింది. ఓటీటీలు రేట్లు త‌గ్గించేశాయి. కొనే సినిమాల సంఖ్య‌నూ త‌గ్గించుకున్నాయి.

ఇప్పుడు నిర్మాత‌లు డిమాండ్ చేసే స్థితిలో లేరు. డిజిట‌ల్ హ‌క్కుల అమ్మ‌కం కోసం వాళ్లే వెంటప‌డే ప‌రిస్థితి ఉంది. కోరుకున్న రేట్లూ ద‌క్క‌డం లేదు. ఇలాంటి టైంలో ఓ సినిమా మాత్రం ఓటీటీ సంస్థ‌లే త‌మ వెంట ప‌డేలా, ఫ్యాన్సీ రేట్లు ఆఫ‌ర్ చేసేలా చేస్తోంది. ఆ చిత్ర‌మే.. మ‌హావ‌తార న‌ర‌సింహ.
క‌న్న‌డ‌లో తెర‌కెక్కిన ఈ యానిమేటెడ్ మూవీ గ‌త నెల రోజులుగా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎలాంటి ప్ర‌భంజ‌నం సాగిస్తోందో తెలిసిందే. పెద్ద‌గా అంచ‌నాల్లేకుండా విడుద‌లై క‌న్న‌డ‌తో పాటు తెలుగు, హిందీలో సంచ‌ల‌న వ‌సూళ్ల‌తో దూసుకెళ్తోంది. ఆ సినిమా క‌లెక్ష‌న్లు రూ.300 కోట్ల‌కు చేరువ‌గా ఉన్నాయి.

విడుద‌లై నాలుగు వారాలు దాటినా ఆ సినిమా జోరు త‌గ్గ‌డం లేదు. ఈ వీకెండ్లో కూడా మంచి వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఐతే ఈ చిత్రానికి విడుద‌ల‌కు ముందు డిజిట‌ల్ హ‌క్కుల అమ్మ‌కం జ‌ర‌గ‌లేదు. నిర్మాత‌లే అమ్మ‌లేదా.. ఓటీటీల నుంచి ఆఫ‌ర్లు లేవా అన్న‌ది తెలియ‌దు. డిజిట‌ల్ హ‌క్కులు అమ్మ‌కుండానే సినిమాను థియేట‌ర్ల‌లోకి తీసుకొచ్చారు. ఇప్పుడేమో సినిమా ఇర‌గాడేసింది.

థియేట‌ర్ల‌లో ఈ సినిమాను చూసేవాళ్లు బాగానే చూస్తున్నారు. ఓటీటీలోకి వ‌స్తే చూద్దామ‌ని ఎదురు చూస్తున్న వాళ్లూ పెద్ద సంఖ్య‌లో ఉన్నారు. ఫ్యామిలీస్, పిల్ల‌ల‌కు న‌చ్చే సినిమా కావ‌డంతో ఓటీటీలోకి వ‌చ్చాక మంచి డిమాండ్ ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. ఈ నేప‌థ్యంలో ఈ సినిమా హ‌క్కుల కోసం భారీ డిమాండ్ నెల‌కొంది. ఓటీటీలు ఫ్యాన్సీ రేట్లు ఆఫ‌ర్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. భారీ చిత్రాలతో స‌మానంగా మ‌హావ‌తార న‌ర‌సింహ డిజిట‌ల్ రైట్స్ అమ్ముడ‌య్యే అవ‌కాశ‌ముంది.