పూజా హెగ్డేకు మళ్లీ నిరాశేనా?

పూజా హెగ్డే బేసిగ్గా బాలీవుడ్ హీరోయిన్ అయినా.. ఆమెకు స్టార్ ఇమేజ్ వచ్చింది, పెద్ద పెద్ద సినిమాలు చేసింది తెలుగులోనే. కెరీర్ ఆరంభంలో చేసిన ముకుంద, ఒక లైలా కోసం లాంటి చిత్రాలు నిరాశపరిచినా.. ‘దువ్వాడ జగన్నాథం’తో బ్రేక్ అందుకున్న ఆమె.. చూస్తుండగానే పెద్ద రేంజికి ఎదిగిపోయింది. అరవింద సమేత, మహర్షి, అల వైకుంఠపురములో లాంటి ఘనవిజయాలతో ఆమె దూసుకెళ్లింది. కానీ ఆమె ప్రైమ్ ఎక్కువ కాలం కొనసాగలేదు. వరుస ఫ్లాపులు ఆమెను వెనక్కి లాగేశాయి. ఎంత వేగంగా పైకి ఎదిగిందో.. అంతే వేగంగా కింద పడిపోయింది. రెండేళ్లకు పైగా తెలుగులో ఆమెకు సినిమానే లేని పరిస్థితి తలెత్తింది.

‘గుంటూరు కారం’ నుంచి తప్పించాక.. తెలుగులో ఇంకో అవకాశమే అందుకోలేకపోయింది పూజా. తన రీఎంట్రీ మూవీ గురించి వార్తలు వస్తున్నాయి కానీ.. అవేవీ నిజం కావడం లేదు. ఇటీవల పూజా సైతం తన టాలీవుడ్ రీఎంట్రీ గురించి మాట్లాడింది. తాను ఓ సినిమాకు సంతకం చేసినట్లు చెప్పింది. దుల్కర్ సల్మాన్ హీరోగా రవి నేలకుడితి అనే కొత్త దర్శకుడు సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో చేయబోయే సినిమాలో పూజా నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. దాని గురించి ఇక అధికారిక ప్రకటన రావడమే తరువాయి అనుకున్నారు.

కానీ ఇప్పుడు ఉన్నట్లుండి కథ అడ్డం తిరిగింది. ఈ చిత్రంలో పూజా నటించట్లేదు. ఆమె స్థానంలోకి శ్రుతి హాసన్ రానుంది అనే వార్తలు రావడం గమనార్హం. తాను ఈ సినిమాలో నటిస్తున్న విషయాన్ని శ్రుతి ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టింది. అంటే.. పూజా దీన్నుంచి తప్పుకున్నట్లే. అలా కాకుండా ఇద్దరు నటించనున్నారా అనే కోణంలో కూడా రూమర్స్ వస్తున్నాయి కానీ అధికారిక ప్రకటన వచ్చేవరకు నమ్మలేం. ఒకవేళ పూజ స్థానంలోకి శృతి వచ్చిన విషయం నిజమైతే పూజకు ఇదొక బ్యాడ్ లక్ అనే అనుకోవాలి. అంతా ఓకే అనుకున్నాక పూజా ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో ఏమో మరి. ఒకప్పుడు పూజా చేసిన సినిమాలతో పోలిస్తే ఈ ప్రాజెక్టు స్కేల్ చిన్నదే అయినా.. ప్రస్తుత పరిస్థితుల్లో ఆమెకు ఆమాత్రం ఛాన్స్ రావడమే కష్టంగా ఉంది. కానీ చివరికి ఆ ఛాన్స్‌ కూడా చేజారింది. ఇక మళ్లీ తెలుగులో పూజాను చూస్తామా అన్నది సందేహమే.