థియేటర్లో సమంతని చూసి రెండేళ్లు గడిచిపోయాయి. ఖుషి తర్వాత మళ్ళీ దర్శనం జరగలేదు. శుభంకు నిర్మాత కాబట్టి ఏదో చిన్న క్యామియో చేసింది కానీ దాని వల్ల కలిగిన ప్రయోజనం పెద్దగా లేదు. ఇంత గ్యాప్ తీసుకోవడం గురించి సామ్ స్పందించింది. గ్రాజియా ఇండియా అనే ఫ్యాషన్ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు సంగతులు పంచుకుంది. ఆరోగ్యం మీద ఎక్కువ దృష్టి పెట్టడం వల్లే నటించడం తగ్గించుకున్నానని, సంవత్సరానికి అయిదు సినిమాల్లో నటించడం కన్నా అందరికీ గుర్తుండిపోయే గొప్ప పాత్రలు చేయడం ముఖ్యమని గుర్తించినట్టు చెప్పుకొచ్చింది. సామజిక సేవ గురించి ప్రస్తావించింది.
నలుగురు మెచ్చుకునే మంచి పనులు చేసే స్థాయికి చేరుకున్నందుకు సంతోషంగా ఉందంటున్న సమంతా ప్రస్తుతం రక్త్ బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. రాజ్ అండ్ డికె పర్యవేక్షణలో ఇది రూపొందుతోంది. ఏవో ఆర్థిక కారణాల వల్ల ఆగిపోయిందనే ప్రచారం జరిగింది కానీ అలాంటిదేమి లేదని ఇటీవలే ప్రొడ్యూసర్లు క్లారిటీ ఇచ్చారు. అయితే షూట్ తిరిగి మొదలయ్యింది లేనిది ఇంకా నిర్ధారణ కాలేదు. రెండు వందల కోట్లకు పైగా బడ్జెట్ ని నెట్ ఫ్లిక్స్ దీని మీద ఖర్చు పెడుతోంది. ఇది కాకుండా మా ఇంటి బంగారం అనే సినిమాని సామ్ గతంలోనే ప్రకటించింది. దీనికి నందినిరెడ్డి దర్శకత్వం వహించొచ్చు.
ఇవి తప్ప సమంతా ఇంకే కమిట్ మెంట్స్ ఇవ్వలేదు. రామ్ చరణ్ పెద్దిలో స్పెషల్ సాంగ్ చేస్తుందనే ప్రచారం గాసిప్ గానే మిగిలిపోయింది. అమెజాన్ ప్రైమ్ నిర్మించిన సిటాడెల్ వెబ్ సిరీస్ నిరాశ పరచడంతో సామ్ కొంత బ్రేక్ తీసుకుంది. రాజ్ తో కలిసి ఎక్కువ తిరగడం గురించి పలు పుకార్లకు రెక్కలు వచ్చిన నేపథ్యంలో వాటి గురించి సమంత స్పందించడం లేదు. నాగచైతన్యతో విడాకులు తీసుకున్నాక లైఫ్ పార్ట్ నర్ గా తిరిగి ఎవరిని ఎంచుకుంటుందనే దాని మీద ఇంకా సస్పెన్స్ తొలగలేదు. ఏదో ఒక రూపంలో మీడియా ద్వారా యాక్టివ్ గా ఉండటం మాత్రం సమంత ప్రత్యేకతని చెప్పాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates