జూనియర్ ఎన్టీఆర్‌ను ఉద్దేశించి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల విషయమై అభిమానుల ఆగ్రహం ఇంకా చల్లారలేదు. ఈ విషయమై ఇప్పటికే అనంతపురంలో నిరసన ప్రదర్శనలు చేశారు అభిమానులు. లీక్ అయిన ఆడియో తనది కాదంటూనే, క్షమాపణ చెబుతూ ఎమ్మెల్యే ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశాక కూడా వారి కోపం తగ్గలేదు. ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ ఫ్యాన్స్ ఆందోళనల సందర్భంగా డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
ఐతే ఎమ్మెల్యే నుంచి స్పందన లేకపోవడంతో ఫ్యాన్స్ ప్రెస్ మీట్ పెట్టారు. రెండు మూడు రోజుల ముందే ఫ్యాన్స్ అంతా కలిసి అనంతపురంలో ప్రెస్ మీట్ పెట్టాలని ప్రయత్నించగా.. పోలీసుల అనుమతి లభించలేదు. తర్వాత విజయవాడలో ప్రయత్నించినా ఫలితం లేకపోయిందట. దీంతో హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఫ్యాన్స్ కలిసి పెద్ద సంఖ్యలో ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు అల్టిమేటం విధించారు.
ఎమ్మెల్యే నాలుగు గోడల మధ్య సారీ చెబుతూ సెల్ఫీ వీడియో రిలీజ్ చేస్తే తాము ఒప్పుకోమని.. అనంతపురంలో బహిర్గతంగా ప్రెస్ మీట్ పెట్టాలని, దానికి మీడియా వాళ్లతో పాటు ఎన్టీఆర్ ఫాన్స్‌ను కూడా పిలవాలని అభిమానులు డిమాండ్ చేశారు. అంతే కాక ఫోన్ కాల్‌లో ఎవరినైతే బెదిరించారో ఆ వ్యక్తిని కూడా పిలిచి అందరి ముందు ఎన్టీఆర్ తల్లికి క్షమాపణ చెప్పాలని అభిమానులు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ అభిమానులు ఇలాంటివి చూస్తూ ఊరుకోరని.. వీడియో రిలీజ్ చేశాం కదా అయిపోయింది అనుకుంటే పొరపాటని..అభిమానులు ఆగరని వారు హెచ్చరించారు.
ఎమ్మెల్యే క్షమాపణ చెప్పని పక్షంలో అనంతపురంలో డీజే పెట్టి ఆయన ఎన్టీఆర్‌ను, ఆయన తల్లిని తిట్టిన ఆడియోలను జనాలకు చేరవేస్తామని అభిమానులు వార్నింగ్ ఇచ్చారు. తామంతా తెలుగు దేశం వాళ్లమే అని, ఎన్టీఆర్ కూడా తెలుగుదేశం పార్టీయే అని.. మరి ఎన్టీఆర్ తల్లిని దూషించిన ఎమ్మెల్యేను ఇంకా ఎందుకు సస్పెండ్ చేయలేదని అభిమానులు ప్రశ్నించారు. ఈ వ్యవహారంతో చంద్రబాబు, లోకేష్‌లకు సంబంధం లేదనే భావిస్తున్నామని.. కానీ వ్యక్తిగత అజెండాతో బూతులు తిట్టిన ప్రసాద్ మీద చర్యలు చేపట్టాల్సిందే అని ఫ్యాన్స్ డిమాండ్ చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates