అక్కినేని నాగార్జున నూరో సినిమాకు రంగం సిద్ధమవుతోంది. ఈ నెల 29 ఆయన పుట్టినరోజు సందర్భంగా అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇవ్వబోతున్నారు. ఆర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ వచ్చే ఏడాది రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఇంత పెద్ద మైలురాయిని అందుకోబోతున్న టైంలో కింగ్ ముందు చాలా సవాళ్లు ఎదురు కాబోతున్నాయి. మొదటిది అభిమానుల్లో తన మీద ఉన్న అసంతృప్తిని తొలగించడం. బ్రహ్మాస్త్ర పార్ట్ 1, కుబేర, కూలీలో వరసగా చనిపోయే సపోర్టింగ్ రోల్స్ చేయడం పట్ల వాళ్ళు ఒకింత నిరసన స్వరంతో ఉన్నారు. దాన్ని తగ్గించడం అంత సులభం కాదు.
పైగా డైరెక్టర్ ఆర్ కార్తిక్ ఫామ్ లోనో లైమ్ లైట్ లోనో ఉన్నోడు కాదు. ఇంతకు ముందు తీసిన తమిళ మూవీ ఆకాశం పేరుతో తెలుగులో డబ్ అయితే, వచ్చిన సంగతి కూడా ఎవరికీ గుర్తు లేదు. సో ఇంత గుడ్డిగా నమ్మి అతనికి అవకాశం ఇచ్చాడంటే చాలా పెద్ద బరువే. ఎందుకంటే మోహన్ రాజాని కాదని మరీ కార్తీక్ కి ఛాన్స్ ఆఫర్ చేయడం చిన్న విషయం కాదు. ఇది కాకుండా స్టార్ హీరోల్లో వందో సినిమా మరీ గొప్పగా అచ్చిరాలేదు. చిరంజీవికి త్రినేత్రుడు ఫ్లాప్ కాగా బాలకృష్ణకు గౌతమీపుత్ర శాతకర్ణి హిట్టనిపించుకుంది కానీ రికార్డులు బద్దలు కొట్టలేదు. వెంకటేష్ ఇంకా ఆ నెంబర్ కి దూరంలో ఉన్నారు కాబట్టి లిస్టులోకి రారు.
ఇవన్నీ పక్కనపెడితే గత కొన్నేళ్లుగా సోలో హీరోగా నాగార్జున సత్తా చాటిన సినిమాలు మూడే. సోగ్గాడే చిన్ని నాయనా బ్లాక్ బస్టర్ కాగా బంగార్రాజు మంచి వసూళ్లతో పాసయ్యింది. నా సామిరంగ అద్భుతాలు చేయకపోయినా హిట్టు స్టాంప్ వేయించుకుంది. అయినా సరే ఈ కిక్ నాగ్ ఫ్యాన్స్ కి సరిపోవడం లేదు. వెంకీ లాగా సంక్రాంతికి వస్తున్నాం రేంజ్ లో వందల కోట్లు వసూలు చేసే పెద్ద ఇండస్ట్రీ హిట్టు కొట్టాలని కోరుకుంటున్నారు. మరి కార్తీక్ అంత బరువు ఏ మేరకు మోయగలడనే దాన్ని బట్టే ఫలితం ఆధారపడి ఉంటుంది. అంచనాలు, బిజినెస్ లెక్కలు, ఫ్యాన్స్ ఎమోషన్లు ఇలా ఎన్నో సవాళ్లు నాగ్ కు స్వాగతం చెప్పబోతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates