వార్ 2, కూలీ… అసలు పరీక్ష ఇప్పుడే

ఇండిపెండెన్స్ డే వీకెండ్లో ఇండియాలో రెండు క్రేజీ సినిమాలు రిలీజ‌య్యాయి. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షించిన ఆ చిత్రాలే.. కూలీ, వార్-2. ఈ రెంటికీ పాజిటివ్ టాక్ రాలేదు. చూసిన ప్రేక్ష‌కులు పెద‌వి విరిచారు. రివ్యూలు కూడా సానుకూలంగా లేవు. ఉన్నంత‌లో కూలీకి కాస్త బెట‌ర్ టాక్, రివ్యూలు వ‌చ్చాయి. ఐతే ఈ చిత్రాల‌కు టాక్ ఎలా ఉన్న‌ప్ప‌టికీ ఈ వీకెండ్ బాక్సాఫీస్ క‌ళ‌క‌ళ‌లాడింది. వార్ 2 కు అనుకున్నంత భారీ స్థాయిలో ఓపెనింగ్ రాకపోయినా వీకెండ్ హాలిడేస్ లో బాగానే పుంజుకుంది. కూలీ మూవీ అయితే కోలీవుడ్ ఆల్ టైమ్ రికార్డు ఓపెనింగ్ తెచ్చుకొని వీకెండ్ అంతా క‌లెక్ష‌న్లు కొల్ల‌గొట్టింది. ఇప్ప‌టికే ఆ సినిమా రూ.300 కోట్లకు పైగా వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఆ సినిమాపై టాక్ పెద్ద‌గా ప్ర‌తికూల ప్ర‌భావం చూప‌లేదు. వార్-2 మాత్రం ప‌డుతూ లేస్తూ సాగింది వీకెండ్లో. ఆ సినిమా వ‌సూళ్లు కూడా రూ.200 కోట్ల‌కు చేరువ‌గా వ‌చ్చాయి.

ఐతే ఇండిపెండెన్స్ డే లాంగ్ వీకెండ్‌ను బాగా సొమ్ము చేసుకున్న ఈ రెండు చిత్రాల‌కు అస‌లు ప‌రీక్ష సోమ‌వారం మొద‌లు కానుంది. వీకెండ్ అయ్యాక బాక్సాఫీస్ ద‌గ్గ‌ర నిల‌బ‌డ‌డం రెంటికీ స‌వాలే. ముఖ్యంగా వార్-2 సినిమా వ‌సూళ్లు సోమ‌వారం నుంచి బాగా డ్రాప్ అయ్యే సంకేతాలు క‌నిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ఇక చెప్పుకోద‌గ్గ షేర్ రావ‌డం సందేహ‌మే. డెఫిషిట్ల‌తో షోలు ర‌న్ చేయాల్సిన ప‌రిస్థితి రావ‌చ్చు. ఇప్ప‌టిదాకా తెలుగులో రాబ‌ట్టాల్సిన దాంట్లో ఈ చిత్రం స‌గం కూడా వెన‌క్కి తేలేక‌పోయింది. కాబ‌ట్టి భారీ న‌ష్టాలు త‌ప్పేలా లేవు.

కూలీ సినిమా ఇప్ప‌టిదాకా బాగా నెట్టుకొచ్చింది కానీ.. ఇక‌పై ఆ సినిమాకూ బండి న‌డ‌వ‌డం క‌ష్ట‌మే. ఇప్ప‌టిదాకా తెలుగులో ఈ సినిమా యావ‌రేజ్‌గా 60-70శాతం మ‌ధ్య రిక‌వ‌రీ రాబ‌ట్టిన‌ట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల 80 శాతం దాకా రిక‌వ‌ర్ అయింది. వీక్ డేస్‌లో కూడా చెప్పుకోద‌గ్గ వ‌సూళ్లు రాబ‌డితేనే కూలీ బ్రేక్ ఈవెన్ అవుతుంది. కొత్త సినిమాల రిలీజ్ టైంలో కొంచెం జోరు త‌గ్గించిన మ‌హావ‌తార న‌ర‌సింహ త‌ర్వాత మ‌ళ్లీ పుంజుకుంది. ఇప్పుడు కొత్త చిత్రాల‌కు దీటుగా వ‌సూళ్లు రాబ‌డుతోంది. ఐతే ఈ వారం వారం పెద్ద రిలీజ్‌లు ఏవీ లేక‌పోవ‌డం కూలీ, వార్-2 చిత్రాల‌కు కొంత క‌లిసొచ్చే విష‌యం. మ‌రి ఈ అడ్వాంటేజీని ఈ చిత్రాలు ఎంత‌మేర ఉప‌యోగించుకుంటాయో చూడాలి.