ఇండిపెండెన్స్ డే వీకెండ్లో కూలీ, వార్-2 చిత్రాలు భారీ అంచనాల మధ్య రిలీజయ్యాయి. ఐతే ఈ రెండు చిత్రాల్లో దేనికీ పాజిటివ్ టాక్ రాలేదు. కాకపోతే ‘వార్-2’ విషయంలో ఎక్కువ నెగెటివిటీ కనిపించింది. అలా అని ‘కూలీ’ గురించి కూడా ఎవ్వరూ పూర్తి పాజిటివ్‌గా మాట్లాడలేదు. సినిమాలో ఎన్నో లోపాలున్నాయి. ఏ క్యారెక్టరూ సరిగా లేదు. కథలో దమ్ము లేదు. స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్‌గా లేదు. లాజిక్ లేని సీన్లు ఎన్నెన్నో. సినిమా మీద విడుదలకు ముందు ఉన్న హైప్‌కు, అందులోని కంటెంట్‌కు పొంతన లేదనే చెప్పాలి. కానీ ఈ చిత్రానికి వసూళ్ల పరంగా మాత్రం ఢోకా లేదు. ‘వార్-2’ పడుతూ లేస్తూ సాగుతోంది కానీ.. ‘కూలీ’ మాత్రం వీకెండ్లో బాక్సాఫీస్ దగ్గర స్టడీగా సాగుతోంది.
అటు తమిళంలో, ఇటు తెలుగులో ఈ చిత్రానికి రోజూ భారీ వసూళ్లు వస్తున్నాయి. ఆదివారానికి రెండు భాషల్లోనూ షోలు సోల్డ్ ఔట్, ఫాస్ట్ ఫిల్లింగ్ షోలు పెద్ద ఎత్తునే కనిపిస్తున్నాయి. వీకెండ్ తర్వాత పరిస్థితి ఏమో కానీ.. ఆదివారం వరకు ఈ సినిమాకు ఢోకా లేదు. చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ మార్కుకు సినిమా దగ్గరగా వెళ్లిపోతోంది. లోకేష్ కనకరాజ్‌కు ఇది ఆరో సినిమా. ఇప్పటిదాకా తన సినిమాల్లో కమర్షియల్‌గా ఏదీ ఫెయిల్యూర్ కాకపోవడం గమనార్హం. తన చిత్రాల్లో ఫుల్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాలు ఖైదీ, విక్రమ్ మాత్రమే. తన తొలి చిత్రం ‘మానగరం’ పాజిటివ్ టాకే తెచ్చుకున్నా.. స్టార్ కాస్ట్ లేకపోవడం వల్ల కమర్షియల్‌గా మరీ పెద్ద సక్సెస్ ఏమీ కాలేదు.
మాస్టర్, లియో నెగెటివ్ టాకే తెచ్చుకున్నప్పటికీ వసూళ్ల విషయంలో ఢోకా లేదు. ‘లియో’ తన కెరీర్లో అత్యంత నెగెటివ్ టాక్ తెచ్చుకున్న చిత్రం. అయినా 600 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. రిలీజ్‌కు ముందు అదిరిపోయే ప్రోమోలతో తన చిత్రాలకు హైప్ క్రియేట్ చేయడంలో లోకేష్ విజయవంతం అవుతున్నాడు. అనిరుధ్ మ్యూజిక్ కూడా హైప్ పెంచడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇక ‘కూలీ’కి కాస్టింగ్ కూడా పెద్ద ప్లస్ అయి ఊహించని హైప్ క్రియేట్ అయింది. పోటీలో ఉన్న సినిమా మరీ వీక్ కావడం, వరుస సెలవులు ప్లస్ అయి ‘కూలీ’ బాక్సాఫీస్ దగ్గర పండుగ చేసుకుంటోంది. ఇప్పటికే ఈ చిత్రం రూ.300 కోట్ల దాకా వసూళ్లు రాబట్టడం విశేషం.
Gulte Telugu Telugu Political and Movie News Updates