రికార్డు కోసం ఒకేసారి 15 సినిమాల ప్రారంభోత్సవం

టాలీవుడ్లో కందరు సీనియర్ నిర్మాతలుగా చెలామణి అవుతుంటారు కానీ.. వారి సక్సెస్ రేట్ అంత గొప్పగా ఏమీ ఉండదు. తుమ్మలపల్లి రామ సత్యనారాయణ కూడా ఆ కోవకే చెందుతారు. ఆయన ఎన్నో ఏళ్లుగా నిర్మాతగా కొనసాగుతున్నారు. భీమవరం టాకీస్ పేరు మీద సినిమాలు నిర్మిస్తున్నారు. కానీ ఈ బేనర్ నుంచి ఓ హిట్ మూవీ పేరు చెప్పమంటే సమాధానం కష్టమే. ఐస్ క్రీమ్-2, ధనలక్ష్మి తలుపు తడితే, శివగామి, అవంతిక.. ఇలాంటి సినిమాలు తీసిన నిర్మాత ఆయన. వాటి ఫలితాలేంటో అందరికీ తెలిసిందే. ఇప్పుడు రామసత్యనారాయణ ఒకేసారి 15 సినిమాలు మొదలుపెట్టడం విశేషం. హైదరాబాద్‌లోని ఒక స్టూడియోలో ఒకేసారి ఈ సినిమాల ప్రారంభోత్సవం జరిగింది.

జస్టిస్ ధర్మ, నాగపంచమి, నా పేరు పవన్ కళ్యాణ్, టాపర్, కేపీహెచ్‌బీ కాలనీ, పోలీస్ సింహం, అవంతిక-2, యండమూరి కథలు, బీసీ, హనీ కిడ్స్, సావాసం, డార్క్ స్టోరీస్, మనల్ని ఎవడ్రా ఆపేది, ది ఫైనల్ కాల్, అవతారం.. ఇవీ రామ సత్యనారాయణ ప్రొడ్యూస్ చేస్తున్న సినిమాలు. వీటిలో యండమూరి కథలు సినిమాను లెజెండరీ రైటర్ యండమూరి వీరేంద్రనాథే డైరెక్ట్ చేస్తుండడం విశేషం. జి.కె.భారవి ఓ సినిమా తీస్తున్నారు.

ఇంకా ఓం ప్రకాష్, ఉదయ్ భాస్కర్, తల్లాడ, సాయికృష్ణ, సంగకూమార్, శ్రీరాజ్ భళ్లా, రవి బసర, మోహన్ కాంత్, హర్ష, ఏకరి సత్యనారాక్ష్ణ, కృష్ణ కార్తీక్, శ్రీనివాసరావు, ప్రణయ్ రాజ్, డాక్టర్ సతీష్ అనే దర్శకులు మిగతా చిత్రాలను రూపొందించనున్నారు. గతంలో నందమూరి తారకరత్న ఒకేసారి తొమ్మిది సినిమాలను మొదలుపెట్టి రికార్డు సృష్టించారు. ఇప్పుడు రామసత్యనారాయణ కూడా రికార్డు కోసమే ఇలా ఒకేసారి 15 సినిమాలను మొదలుపెట్టినట్లున్నారు. ఈ కార్యక్రమాన్ని వరల్డ్ బుక్ ఆఫ్ రికాార్డ్స్‌లో నమోదు చేసినట్లు రామసత్యనారాయణ వెల్లడించారు.