మళ్ళీ విజృంభిస్తున్న మహావతార్ నరసింహ

రెండు కొత్త ప్యాన్ ఇండియా మూవీస్ వచ్చాయి కదా, ఇరవై రోజులు దాటిన మహావతార్ నరసింహ పూర్తిగా సెలవు తీసుకుంటుందనే అంచనాలు అడ్డంగా తప్పయ్యాయి. లాంగ్ వీకెండ్ సందర్భంగా ఈ యానిమేటెడ్ మూవీ మళ్ళీ విజృంభిస్తోంది. వార్ 2 డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడం, కూలీ మిక్స్డ్ రెస్పాన్స్ తో ఉండటం లాంటి కారణాలు మళ్ళీ పుంజుకునే అవకాశం ఇస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో తారక్, రజని సినిమాలకు టికెట్ ధరలు పెంచుకోవడం మహావతార్ కు సానుకూలంగా మారుతోంది. తెలంగాణలో స్క్రీన్లు తగ్గిపోవడంతో అందుబాటులో ఉన్నవి హౌస్ ఫుల్స్ తో అప్పుడే సోల్డ్ అవుట్స్ పెడుతున్నాయి.

ఇప్పటికీ బుక్ మై షోలో సగటున 10 నుంచి 15 వేల టికెట్లు అమ్ముడుపోతున్నాయంటే ఇంకా చూడాల్సిన ఆడియన్స్ భారీగా ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. ఇప్పటిదాకా రెండు వందల కోట్ల గ్రాస్ దాటేసిన మహావతార్ నరసింహ ఇంకో వంద కోట్లను అవలీలగా దాటేసేలా ఉంది. వార్ 2, కూలి కన్నా ఫ్యామిలీ ఆడియన్స్ దీన్నే బెస్ట్ ఆప్షన్ అనుకోవడం వల్ల సీన్ రివర్స్ అవుతోంది. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం చాలా కేంద్రాల్లో శని, ఆదివారాలు మహావతార్ నరసింహకు షోలు పెరుగుతున్నాయి. డిమాండ్ దృష్ట్యా కొత్తవాటికి తగ్గించి దీనికి కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నారట. ఇది ఈ మధ్య కాలంలో చూడని వింత.  

ఒకవేళ మళ్ళీ పికప్ అయితే మహావతార్ నరసింహకు ఈ నెలాఖరు వరకు బ్రేకులు ఉండవు. ఎందుకంటే మధ్యలో చెప్పుకోదగ్గ రిలీజులు లేవు. ఆగస్ట్ 27 రావాల్సిన రవితేజ మాస్ జాతర వాయిదా పడొచ్చనే ప్రచారం నేపథ్యంలో అది కూడా దీనికే ఉపయోగపడనుంది. యానిమేషన్ లో సరికొత్త విప్లవానికి దారి తీసిన మహావతార్ నరసింహకొచ్చిన స్పందన చూసి ఒక ప్రొడక్షన్ హౌస్ ముందు స్టార్ హీరోతో అనుకున్న ఫాంటసీ మూవీని ఇప్పుడు ఆ ఐడియా డ్రాప్ చేసుకుని పూర్తిగా యానిమేటెడ్ క్యారెక్టర్స్ తో తీసే ఆలోచనలో ఉందట. ఆ రేంజ్ లో నరసింహుడు రెచ్చిపోతున్నాడు. ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదు.