గత ఏడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రేణుకస్వామి హత్యకేసు సినీ ప్రియులు అంత సులభంగా మర్చిపోలేరు. స్వంత అభిమానిని పిలిపించి మరీ మర్డర్ చేయించిన అభియోగం మీద శాండల్ వుడ్ స్టార్ హీరో దర్శన్, ఆయన ప్రియురాలు పవిత్ర గౌడని 2024 జూన్ 11 అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఏడు నెలలు కారాగారంలో మగ్గిన తర్వాత కర్ణాటక హైకోర్టు వీళ్లకు డిసెంబర్ లో బెయిల్ మంజూరు చేసింది. అప్పటి నుంచి దర్శన్ ఇంట్లో ఉంటూ బయట తిరుగుతున్నాడు. తనను కలుసుకోవడానికి వచ్చిన అభిమానులతో ఫోటోలు దిగుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఆగిపోయిన షూటింగులు త్వరలో మొదలుపెడతారనే వార్తలు వస్తున్న టైంలో దర్శన్ కు సుప్రీమ్ కోర్టు మొట్టికాయ వేసింది. బెయిలుని రద్దు చేస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేయడంతో అతనితో పాటు పవిత్ర గౌడని మళ్ళీ పోలీసులు జైలుకు తరలించారు. కారణాలు ఏమైనా ఇలాంటి వారిని బయట ఉంచడం వక్రబుద్దితో సమానమని న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేయడం సంచలనం రేపుతోంది. స్వయానా దర్శన్ అభిమాని అయిన రేణుకస్వామిని అతని హీరోనే హత్య చేయించినట్టు ఘటన జరిగిన వెంటనే బలమైన ఆధారాలు దొరికాయి. అయినా కూడా బెయిలు దక్కడం పట్ల అప్పట్లోనే నిరసన స్వరం గట్టిగా వినిపించింది.
దర్శన్ లాయర్లు మరోసారి బెయిలు కోసం ప్రయత్నించేందుకు రెడీ అవుతున్నారు. ఈసారి మాత్రం సులభంగా బయటికి వచ్చేలా లేడు. స్వయంగా సుప్రీమ్ కోర్టే అభ్యంతరం చెప్పినప్పుడు ఇక ఎవరైనా చేయగలింది ఏమి లేదు. దర్శన్ లో ఎలాంటి పశ్చత్తాపం లేదని, అతనికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందేనని అభిప్రాయాలు ఎక్కువవుతున్న తరుణంలో ఇప్పుడీ పరిణామం హాట్ టాపిక్ గా మారింది. పవిత్రకు అసభ్య సందేశాలు పంపాడనే కారణంతో దర్శన్ ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బెదిరిస్తే పోయడానికి ప్రాణం తీసేదాకా వెళ్ళాడు. తీరా చూస్తే సినిమాని మించిన వయొలెంట్ డ్రామా అతని జీవితంలోనే జరిగింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates