కూలీ… భారం కాదు, భలే బేరం

కూలీ సినిమాకు మేకింగ్ దశలో ఉన్న మొదట్లో తెలుగు డబ్బింగ్ హక్కుల కోసం ప్రయత్నిస్తే 25-30 కోట్లకు బేరం తెగిపోయేదట. కానీ రిలీజ్ దగ్గరపడ్డాక ట్రై చేస్తే రేటు తగ్గుతుందని ఏషియన్ మూవీస్ అధినేత సునీల్ ఎదురు చూశాడట. కానీ చివరికి చూస్తే ఈ సినిమా తెలుగు రైట్స్ రూ.52 కోట్ల దాకా పలికాయి. విపరీతమైన పోటీ మధ్య ఫ్యాన్సీ రేటు పెట్టి హక్కులు తీసుకున్నాడు సునీల్. ఆయనతో దిల్ రాజు, సురేష్ బాబు సైతం చేతులు కలిపారు. ముగ్గురూ కలిసి సినిమాను రిలీజ్ చేస్తున్నారు. 

ఐతే ‘కూలీ’ రైట్స్ కోసం పెట్టిన రేటు గురించి ముందుగా వార్తలు బయటికి వచ్చినపుడు.. రజినీ సినిమాకు ఈ రోజుల్లో అంత రేటా.. అదెలా వర్కవుట్ అవుతుంది అని చాలామంది సందేహాలు వ్యక్తం చేశారు. ఇది పెద్ద రిస్క్ అని అభిప్రాయపడ్డారు. అందులోనూ ఈ మధ్య సక్సెస్ రేట్, థియేటర్లలో ఆక్యుపెన్సీలు పడిపోవడం.. గత కొన్నేళ్లలో రజినీ నుంచి వచ్చిన చిత్రాల్లో ‘జైలర్’ మినహా ఏదీ పది కోట్ల షేర్ కూడా రాబట్టని నేపథ్యంలో ‘కూలీ’ మీద అంత పెట్టుబడి పెట్టడం కరెక్టేనా అన్న చర్చ జరిగింది.

కట్ చేస్తే ఇప్పుడు ‘కూలీ’ సినిమాకు తెలుగులో వచ్చిన క్రేజ్ చూసి అందరూ అవాక్కవుతున్నారు. జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. ఎన్టీఆర్ సినిమా ‘వార్-2’ కంటే దిగువన ఉంటుందనుకున్న సినిమా కాస్తా.. దానికి దీటుగా నిలబడడం కాదు, డామినేట్ చేసింది అడ్వాన్స్ బుకింగ్స్‌లో. కేవలం తొలి రోజే తెలుగులో ఈ చిత్రం రూ.15 కోట్లకు పైగా షేర్ రాబట్టేంత ఊపు కనిపిస్తోంది. సినిమాకు టాక్ ఎలా ఉన్నా వీకెండ్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోవడం గ్యారెంటీ. 

ఇక పాజిటివ్ టాక్ వస్తే.. భారీ లాభాలు పక్కా అనుకోవచ్చు. ముందు రూ.50 కోట్లకు పైగా రేటు చాలా భారం అవుతుందని ట్రేడ్ పండిట్లు భావించారు కానీ.. ఇప్పుడు చూస్తే అది భలే మంచి బేరం అనుకునే పరిస్థితి కనిపిస్తోంది. కేవలం రజినీనే కాకుండా లోకేష్ కనకరాజ్, అనిరుధ్, నాగార్జున.. ఇలా చాలా ఫ్యాక్టర్లు ఈ సినిమాకు పాజిటివ్‌గా పని చేసి ఎవ్వరూ ఊహించని స్థాయిలో క్రేజ్ తెచ్చిపెట్టాయన్నది వాస్తవం.