సినిమాల్ని దక్షిణాది ప్రజలు ఎంతలా ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా వారి జీవితాల్లో ఒక భాగంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే.. సినిమా మీద అభిమానం ఒక ఎత్తు.. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మీద ఉండే ప్రేమ మరో లెవల్. ఆయన సినిమా విడుదల అవుతుందంటే.. ఆ సందర్భంగా చోటు చేసుకునే హడావుడి ఒక రేంజ్ లో ఉంటుంది. కొన్ని క్రేజీ సినిమాల విడుదల వేళ.. అది పీక్స్ కు వెళుతుంది. సిల్వర్ స్క్రీన్ మీద మరే హీరోకు సాధ్యం కాని క్రేజ్ రజనీకాంత్ సొంతం.
ఆయన తాజా మూవీ కూలీ. ఈ సినిమా విడుదల సందర్భంగా చోటు చేసుకుంటున్న ఆసక్తికర పరిణామాలకు కొదవ లేదు. ఇప్పటికే ఈ సినిమా విడుదల వేళ.. ఆఫీసులకు సెలవులు ఇచ్చేశాయి పలు కంపెనీలు. ఈ క్రమంలో మదురైకు చెందిన యూనో ఆక్వా కేర్ అనే కంపెనీ మరో అడుగు ముందుకు వేసింది. తన సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు ఉచితంగా సినిమా టికెట్లు ఇవ్వటంతో పాటు సెలవును కూడా మంజూరు చేసింది.
ఈ విషయం తెలిసిన వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ సంస్థకు మదురైతో పాటు చెన్నై.. బెంగళూరు.. తిరుచ్చి.. తిరునెల్వేలి.. చెంగల్పట్టు.. మూట్టుత్తావణి.. అరప్పాళెయం తదితర ప్రాంతాల్లో బ్రాంచ్ లు ఉన్నాయి. రజనీ తాజా మూవీ విడుదల వేళ.. తమ శాఖల్లో పని చేసే ఉద్యోగులు అందరికి ఉచితంగా కూలీ మూవీ టికెట్లతో పాటు.. సెలవును ప్రకటించటం హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడితో ఆగలేదు. మూవీ విడుదల వేళ.. ఆశ్రమాల్లో ఆహార పంపిణీతో పాటు.. విరాళాలు అందించటం.. ప్రజలకు మిఠాయిలు పంచాలని కూడా డిసైడ్ చేసింది.
యూనో ఆక్వా కేర్ సంస్థ పుణ్యమా అని పలువురు ఉద్యోగులు తమ కంపెనీలకు ఈ సంస్థకు సంబంధించి సర్క్యులర్ కాపీని అటాచ్ చేస్తూ.. సెలవును కోరుతున్నట్లుగా తెలుస్తోంది. గురువారం విడుదల కానున్న ఈ మూవీ మీద అంచనాలు భారీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రీరిలీజ్ వేళ సినిమాకు జరిగిన బిజినెస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే.. పలు ఐటీ కంపెనీలు స్పందిస్తున్న తీరు.. ఈ సినిమా విడుదల వేళ ప్రత్యేకంగా సెలవును ప్రకటించటం ద్వారా రజనీకాంత్ మీద తమకున్న అభిమానాన్ని ప్రదర్శిస్తున్నాయి. మొత్తంగా చూస్తే.. కూలీ మూవీ ఓ పెద్ద పండుగను తలపించే పరిస్థితులు నెలకొన్నాయని చెప్పక తప్పదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates