సినీ ప్రియులకు శుభవార్త : నో హైక్స్ ?

నిన్న సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో ఒకటే మ్యూజిక్ గా మారిపోయిన కూలి, వార్ 2 టికెట్ రేట్ల పెంపు వ్యవహారం ఊహించని మలుపు తీసుకుంది. నిన్న అధికారిక జిఓ రాకపోయినా నిర్మాతలు భారీ హైక్ తీసుకున్నారనే ప్రచారం ఆన్ లైన్ ని ఊపేసింది. దీంతో అభిమానులు, నెటిజెన్లు ఒక్కసారిగా భగ్గుమన్నారు. డబ్బింగ్ సినిమాలకు కూడా ఇష్టానుసారం పెంచేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు ఏకంగా బాయ్ కాట్ నినాదం ఎత్తుకున్నారు. మరి లీకైన న్యూస్ అబద్దమో లేక ఫ్యాన్స్ ముప్పేట దాడిని గుర్తించిన నిర్మాతలు నిర్ణయం మార్చుకోవడమో ఏమో కానీ మొత్తానికి కథ సుఖాంతమయ్యింది.

తెలంగాణలో ఎలాంటి పెంపు ఉండదని, ప్రస్తుతం అమలులో ఉన్న గరిష్ట ధరలే వార్ 2, కూలికి ఉంటాయని లేటెస్ట్ అప్డేట్. అంటే మల్టీప్లెక్సుల్లో 295 రూపాయలు, సింగల్ స్క్రీన్లలో 175 కంటే ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇన్ సైడ్ టాక్ అయితే 75, 50 రూపాయల చొప్పున పెంపు రావొచ్చని అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న రేట్లు నైజాం కన్నా తక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ వెసులుబాటుని వాడుకోవచ్చని వినికిడి. ఒకవేళ ఈ పెంపు కూడా లేకపోతే అందరికన్నా లక్కీ ఫ్యాన్స్ ఏపీలో ఉన్న వాళ్లే అవుతారు.

ఒకరకంగా ఇది చాలా మంచి పరిణామం. ఎందుకంటే ఒరిజినల్ వెర్షన్లకు ప్యాన్ ఇండియా సినిమాలకు హైక్ అడగడం న్యాయమే. కానీ ఇతర భాషల్లో తీసి మనకు డబ్బింగ్ రూపంలో వస్తున్నప్పుడు అదే సూత్రం అమలు పరచడం సరికాదు. వార్ 2లో టెక్నాలజీ వాడి లిప్ సింక్ ద్వారా స్ట్రెయిట్ సెన్సార్ సర్టిఫికెట్ తీసుకున్నా అది ప్రాథమికంగా హిందీ మూవీగానే పరిగణిస్తారు. జూనియర్ ఎన్టీఆర్, నాగార్జునలు నటించారనే కారణంతో పెంపు వైపు మొగ్గు చూపడం ఏంటనేది సగటు ప్రేక్షకుల అవేదన. ఏదైతేనేం క్లైమాక్స్ హ్యాపీగా ముగిసింది. ఆగస్ట్ 14 రెండు భారీ సినిమాలతో లాంగ్ వీకెండ్ కోసం ఫ్యాన్స్ సిద్ధమైపోవచ్చు.