కూలీని శాసించబోయే 3 ఘట్టాలు

ప్రేక్షకుల్లో కూలీ ఫీవర్ మాములుగా లేదు. ఎప్పుడెప్పుడు తమ ఊరి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెడతారాని ఫ్యాన్స్ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ట్రైలర్ కు మిశ్రమ స్పందన వచ్చినా హైప్ విషయంలో మాత్రం ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న కూలీ బ్లాక్ బస్టర్ కు ఇంచు తక్కువైనా అభిమానులు తెగ ఫీలయ్యేలా ఉన్నారు. థియేటర్ కౌంట్ విషయంలో యష్ రాజ్ ప్లానింగ్ వల్ల వార్ 2 ముందంజలో ఉన్నప్పటికీ టికెట్ల అమ్మకాల్లో మాత్రం కూలి ఎవరికి అందనంత ఎత్తుకు దూసుకుపోతోంది. ఆగస్ట్ 14 తెల్లవారేలోపు వచ్చే ప్రీమియర్ షోల రిపోర్ట్స్, రివ్యూలతో సోషల్ మీడియా ఓ రేంజ్ లో హోరెత్తిపోయేలా ఉంది.

ఇక ఇన్ సైడ్ టాక్ ప్రకారం కూలీకి సంబంధించి మూడు కీలక ఘట్టాలు దీని సక్సెస్ ని శాసించబోతున్నాయి. మొదటిది ఇంటర్వెల్. చాలా షాకింగ్ ఎలిమెంట్ తో ఇప్పటిదాకా రజనిని ఎవరూ చూపించని తరహాలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ చేసిన ప్రయోగం థియేటర్ లో గూస్ బంప్స్ ఇవ్వడం ఖాయమంటున్నారు. రెండోది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్. వింటేజ్ లుక్ లో 80 కాలం నాటి రజినిని గుర్తు చేస్తూ పెట్టిన హార్బర్ ఎపిసోడ్ కనక పేలితే జనాలు వెర్రెక్కిపోవడం ఖాయమంటున్నారు. మూడోది ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్. నాగార్జున పాత్ర ముగిశాక ఎంట్రీ ఇచ్చే అమీర్ ఖాన్ తో రజని తలపడే ఫేస్ అఫ్ ఏ మల్టీస్టారర్ కి తీసిపోదని అంటున్నారు.

ఇవి కనక సరిగ్గా క్లిక్ అయితే మిగిలిన సినిమాలో హెచ్చుతగ్గులున్నా సరే బొమ్మ రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని యూనిట్ నమ్మకంగా చెబుతున్న మాట. బుక్ మై షోలో ఇప్పటికే రికార్డుల వేట మొదలుపెట్టిన రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ లు ఫస్ట్ డే చాలా మందికి హార్ట్ ఎటాక్ వచ్చే నెంబర్లు నమోదు చేయబోతున్నారు. కోలీవుడ్ మొదటి వెయ్యి కోట్ల గ్రాసర్ అవుతుందనే నమ్మకం తమిళ ఫ్యాన్స్ లో బలంగా ఉంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప, కెజిఎఫ్ తరహాలో ఇది ఒక ల్యాండ్ మార్క్ మూవీ అవుతుందనే ధీమాతో ఉన్నారు. వాళ్ళ కోరిక ఏ మేరకు నెరవేరబోతోందో ఇంకో నాలుగు రోజుల్లో తేలనుంది.