కూలీ దెబ్బకు రికార్డులు ఖాళీ

ప్రేక్షకుల్లో కూలీ ఫీవర్ మాములుగా లేదు. సూపర్ స్టార్ రజనీకాంత్ కు దర్శకుడు లోకేష్ కనగరాజ్ తోడవ్వడంతో అంచనాలు అంతకంతా పెరుగుతూ పోతున్నాయి. ట్రైలర్ వచ్చాక కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ దాని ప్రభావం ఒక్క శాతం లేకపోవడం ట్రేడ్ ని ఆశ్చర్యపరుస్తోంది. తెలుగు రాష్ట్రాల టికెట్ అమ్మకాలు మొదలుపెట్టకుండా కేరళ, తమిళనాడు నుంచే సుమారు నలభై కోట్ల దాకా వసూలు చేయడం కూలీ మేనియాకు నిదర్శనం. ఏపీ తెలంగాణ స్టార్ట్ అయ్యాక ఈ నెంబర్లు ఎక్కడికి చేరుకుంటాయో ఊహించడం కష్టం. బుక్ మై షో సర్వర్ క్రాష్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సలార్ కు అలా జరిగింది.

అవర్లీ ట్రెండ్స్ లోనూ కూలీ దూసుకుపోతోంది. సగటున గంటకు అయిదు వేల నుంచి యాభై వేల టికెట్ల మధ్యలో ఊచకోత కొనసాగుతూనే ఉంది. వార్ 2 కన్నా చాలా ముందుగా బుకింగ్స్ మొదలుపెట్టడం కూలీకి బాగా కలిసి వస్తోంది. ఇక్కడే కాదు ఓవర్సీస్ లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మూడు మిలియన్లు దాటేసిన తలైవర్ మొదటి షో పడే టైంకి ఏ నెంబర్ దగ్గర ఆగుతాడో అంచనా వేయడం కష్టమనేలా ఉంది. విదేశాల్లో కూలి మేనియా మాటలకు అందడం లేదు. ప్రభుత్వ పోలీసులు సైతం ప్రమోషన్ క్యాంపైన్ లో పాలు పంచుకోవడం చూస్తే రజనీకాంత్ రీచ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు

ఎలాంటి విజువల్ ఎఫెక్ట్స్ లేని ఒక మాములు కమర్షియల్ యాక్షన్ మూవీకి ఇంత బజ్ రావడం వెనుక రజని ఇమేజ్ తో పాటు లోకేష్ సృష్టించుకున్న ఫాలోయింగ్ కారణంగా నిలిచింది. ఫస్ట్ షో నుంచి జస్ట్ యావరేజ్ టాక్ వచ్చినా చాలు ఈ జంట చేయబోయే విధ్వంసం ఓ రేంజ్ లో ఉంటుంది. వెయ్యి కోట్ల గ్రాస్ అందుకోవడం ఈజీనేనని ఇప్పటికి అనిపిస్తోంది కానీ పాజిటివ్ టాక్ రావడం కీలకంగా మారుతుంది. వార్ 2కి వచ్చే స్పందన కూడా వసూళ్ల మీద ప్రభావం చూపిస్తుంది. ఏదేమైనా ఏడు పదుల వయసులో రజనీకాంత్ సృష్టిస్తున్న సునామి చూస్తే తలలు పండిన ట్రేడ్ కి సైతం నోట మాట రావడం లేదు.