మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తర్వాత ఏడాదిన్నరకు పైగా గ్యాప్ తీసుకున్న అనుష్క వచ్చే నెల సెప్టెంబర్ 5 ఘటిగా రాబోతోంది. పలు వాయిదాల అనంతరం ఎట్టకేలకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నారు. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాలో అనుష్క సరసన తమిళ నటుడు విక్రమ్ ప్రభు హీరోగా నటించాడు. ఇందులో అనుష్క గంజాయి అమ్మే ఊర మాస్ వయొలెన్స్ పాత్ర చేసింది. ఇప్పటిదాకా కంటెంట్ పరంగా ఎలాంటి క్లూస్ ఇవ్వకుండా దాచి పెట్టిన యువి టీమ్ తాజాగా ట్రైలర్ కట్ తో కథను చెప్పే ప్రయత్నం చేసింది. చెప్పాలంటే ఊహించిన దానికన్నా కంటెంట్ బలంగా ఉంది.
ఎత్తయిన కొండలను సునాయాసంగా ఎక్కుతారని ఘాటీలకు పేరు. ఈ తెగకు చెందిన వాళ్ళు ఎవరైనా ఆడామగ తేడా లేకుండా ఎంతటి ప్రమాదానికైనా తెగబడతారు. వాళ్లలో ఒక అందమైన జంట (అనుష్క – విక్రమ్ ప్రభు) కూడా ఉంటుంది. గంజాయి వ్యాపారంతో కోట్లు సంపాదిస్తున్న లోకల్ డాన్ (చైతన్య రావు) ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఒక దశ దాటాక ఘాటీల్లో తిరుగుబాటు మొదలవుతుంది. తాము చేస్తున్న పని వల్ల అమాయకుల ప్రాణాలు పోతున్నాయని గుర్తించి హింసకు తెగబడతాడతారు. మరి ఘాటీల దొమ్మీలో దొరలు ఏమయ్యారో తెలియాలంటే ఇంకో నెల రోజులు ఆగాల్సిందే.
దర్శకుడు క్రిష్ తన రెగ్యులర్ స్టైల్ కి భిన్నంగా ఈసారి పూర్తిగా మాస్ టర్న్ తీసుకున్నారు. పుష్ప, కెజిఎఫ్ తరహా బ్యాక్ గ్రౌండ్ అనిపిస్తున్నప్పటికీ కొండలు, గంజాయి, గిరిజన తెగలు, అడవులు వగైరా విజువల్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. ఇంత కాలం తర్వాత అనుష్కని మళ్ళీ స్క్రీన్ మీద చూడటం ఫ్యాన్స్ కి పండగే. సాగర్ నాగవెల్లి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫ్రెష్ గా ఉంది. మనోజ్ రెడ్డి కాటసాని ఛాయాగ్రహణం హై స్టాండర్డ్ లో కనిపించింది. బడ్జెట్ పరంగా భారీగా ఖర్చు పెట్టిన వైనం తెరమీద ఆవిష్కరించారు. టెక్నికల్ గా, కంటెంట్ పరంగా అంచనాలు పెంచేలా ఉన్న ఘాటీ సెప్టెంబర్ 5 థియేటర్లలో అడుగు పెట్టనుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates