నో కాంప్రమైజ్ అంటున్న ఖైదీ 2

స్టార్ డైరెక్టర్లను ప్రశ్నలు అడిగే క్రమంలో కొందరు శృతి తప్పేస్తూ ఇంకొకరిని కించపరిచేలా మాట్లాడ్డం తరచుగా జరుగుతోంది. కూలి ప్రమోషన్లలో భాగంగా లోకేష్ కనగరాజ్ కు ఒక క్వశ్చన్ ఎదురయ్యింది. విజయ్, కమల్ హాసన్, రజనీకాంత్ లాంటి టాప్ స్టార్స్ ని హ్యాండిల్ చేశాక ఖైదీ 2 కోసం కార్తీ లాంటి టయర్ 2 హీరోతో చేయడం పట్ల ఎలా ఫీలవుతున్నారని ఇంటర్వ్యూయర్ అడిగాడు. దానికి లోకేష్ సమాధానమిస్తూ నేను ఋజువు చేసుకోవాల్సిన టైంలో ఖైదీ రూపంలో అవకాశం ఇచ్చి వెన్ను తట్టింది కార్తీనే అని, ఆయనే తనకు పెద్ద స్టార్ అని, సీక్వెల్ తో పెద్ద హిట్ ఇస్తానని పేలిపోయే సమాధానం ఇచ్చాడు.

ఖైదీ 2కి సంబంధించి లోకేష్ కనగరాజ్ ఇప్పటికే 35 పేజీలకు పైగా స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నాడు. కూలి రిలీజైన తర్వాత కొద్దిరోజులు బ్రేక్ చేసుకుని ఫైనల్ వెర్షన్ పనులు చూసుకోబోతున్నాడు. అటు కార్తీ కూడా మూడు సినిమాలతో బిజీ ఉన్నాడు. అవన్నీ పూర్తవ్వడానికి ఈ ఏడాది గడిచిపోయేలా ఉంది. సో డిసెంబర్ నుంచి పార్ట్ 2 షూటింగ్ ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. ఖైదీ 2లో జైలు నుంచి బయటికి వచ్చిన ఢిల్లీ గతంలో ఏం చేశాడు, అతనికి విక్రమ్, రోలెక్స్ లతో ఉన్న సంబంధం ఏంటి, ఈ ముగ్గురు లోకేష్ యునివర్స్ లో ఎలా కలవబోతున్నారనే పాయింట్ కోసం ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

గత కొంత కాలంగా సరైన బ్లాక్ బస్టర్ లేక ఇబ్బంది పడుతున్న కార్తీకి ఖైదీ 2 మరో పెద్ద బ్రేక్ కానుంది. ఇది పూర్తి చేశాకే లోకేష్ కనగరాజ్ అమీర్ ఖాన్ తో చేయబోయే ప్యాన్ ఇండియా మూవీకి రెడీ అవుతాడు. లోకేష్ ని ఒక విషయంలో ప్రత్యేకంగా మెచ్చుకోవచ్చు. రెండు హిట్లు పడటం ఆలస్యం తమకు లైఫ్ ఇచ్చిన మీడియం హీరోలను మర్చిపోయే స్టార్ డైరెక్టర్లు కొందరు లేకపోలేదు. వాళ్లకు భిన్నంగా లోకేష్ ఆలోచించడం తన లక్షణాన్ని సూచిస్తుంది. అనుకుంటే ఖైదీ 2 తీయకపోయినా నష్టమేం లేదు. కానీ లోకేష్ మాత్రం కార్తీలోని మొత్తం పవర్ ని బయటికి తీస్తా అంటున్నాడు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తాడట.