టాలీవుడ్లో వరుసగా రెండు వారాలు మంచి క్రేజున్న సినిమాలు రిలీజయ్యాయి. జులై 24న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ‘హరిహర వీరమల్లు’ రిలీజైంది. తర్వాతి వారం విజయ్ దేవరకొండ మూవీ ‘కింగ్డమ్’ సందడి చేసింది. ఈ రెండు చిత్రాలూ వీకెండ్ వరకు మంచి వసూళ్లే సాధించాయి. మరోవైపు కన్నడ అనువాదం అయిన యానిమేషన్ మూవీ ‘మహావతార నరసింహ’ వీకెండ్, వీక్ డేస్ అని తేడా లేకుండా మంచి వసూళ్లు సాధిస్తూ దూసుకెళ్తోంది. పవన్ సినిమా థియేటర్ల నుంచి దాదాపుగా లేచిపోయింది. విజయ్ మూవీ కూడా వీకెండ్ తర్వాత వీక్ అయింది. ఇక ఈ వారాంతం విషయానికి వస్తే.. తెలుగు నుంచి చెప్పుకోదగ్గ సినిమాలేవీ రిలీజయ్యేలా కనిపించడం లేదు.
కన్నడ అనువాద చిత్రం ‘సు ఫ్రమ్ సో’ను మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేస్తోంది కానీ.. ప్రస్తుతానికైతే దానికి పెద్దగా బజ్ లేదు. రిలీజ్ తర్వాత కథ మారుతుందేమో చూడాలి.
మరి ఈ వారానికి బాక్సాఫీస్ లీడర్‌గా నిలిచే సినిమా ఏది అంటే.. కొత్త సినిమాలేవీ కాదు, 20 ఏళ్ల కిందటి చిత్రం కావచ్చు అనే అంచనాలు కలుగుతున్నాయి. ఆ సినిమానే.. అతడు. టాలీవుడ్లో రీ రిలీజ్ ట్రెండుకు మంచి ఊపు తెచ్చినవి మహేష్ బాబు సినిమాలే. పోకిరి, ఒక్కడు, మురారి, ఖలేజా లాంటి సినిమాలు ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచేలా వసూళ్లు సాధించాయి.
ఇప్పుడు మహేష్ కెరీర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ అనదగ్గ ‘అతడు’ను రీ రిలీజ్ చేస్తున్నారు. దీని కోసం జయభేరి సంస్థ భారీగా ఖర్చు పెట్టింది. ప్రమోషన్లు కూడా గట్టిగా చేస్తోంది. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని మేజర్ సిటీస్‌లో థియేటర్ల దగ్గర భారీ మహేష్ కటౌట్లు పెట్టడమే కాక.. పోస్టర్లు కూడా వేస్తున్నారు. ఈ సినిమా మహేష్ అభిమానులకు ఎంత స్పెషలో తెలిసిందే కాబట్టి.. థియేటర్లలో సందడి మరో స్థాయిలో ఉంటుందని భావిస్తున్నారు. కొత్త చిత్రాలను వెనక్కి నెట్టి ఇది మంచి ఓపెనింగ్స్ తెచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. రీ రిలీజ్ రికార్డులు కూడా బద్దలైతే ఆశ్చర్యం లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates