సూపర్ స్టార్ రజనీకాంత్ కూలికి సెన్సార్ నుంచి ఏ సర్టిఫికెట్ రావడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే ఆయన సినిమాకు అడల్ట్స్ ఓన్లీ ట్యాగ్ పడి 36 సంవత్సరాలు దాటేసింది. చివరిసారిగా 1989లో శివకు వచ్చాక మళ్ళీ ఎప్పుడూ రిపీట్ కాలేదు. అంతకు ముందు ఈ లిస్టులో 19 చిత్రాలున్నాయి. అవి కోడి పరకత్తు, ఊర్కావలన్, విడుతలై, ఉన్ కన్నిల్ నీరు వజిన్దల్, నాన్ సిగప్పు మనితన్, నాన్ మహాన్ అల్ల, కై కొడుక్కుమ్ కై, శివప్పు సూరియన్, పాయుమ్ పులి, మూండ్రు ముగం, పుతుకవితై, రంగ, నేత్రికన్, కాళీ, ఎన్ కెల్విక్కు ఎన్న బాతిల్, అవళ్ అప్పడితాన్, ఇల్లమై ఊంజల్ ఆడుకిరతు, గాయత్రి, భువన ఓరు కేల్విక్కురి.
ఇవన్నీ 1977 నుంచి 1989 మధ్యలో కేవలం పన్నెండేళ్ల గ్యాప్ లో వచ్చిన రజనీకాంత్ ఏ సర్టిఫికెట్ సినిమాలు. ఇప్పుడు మూడు దశాబ్దాల తర్వాత ఆయనకు ఈ ముద్ర పడటం విశేషం. దీన్ని బట్టి లోకేష్ కనగరాజ్ ఏ స్థాయిలో వయొలెన్స్ జొప్పించాడో అర్థం చేసుకోవచ్చు. నాగార్జున ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన జీవితంలో ఎప్పుడూ వాడని చెడు పదాలు ఇందులో చెప్పానని, తన ఫ్యామిలీ రియాక్షన్ థియేటర్ లో చూడాలని ఉందని చెప్పడం వీడియో రూపంలో వైరలయ్యింది. ఇప్పుడు ఏ రావడం చూస్తే విన్నదాని కన్నా ఎక్కువ హింస, బూతులు ఉండబోతున్నాయని అర్థమవుతోంది.
తమిళ బయ్యర్లు ఈ విషయంలో కొంత ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే మల్టీప్లెక్సుల్లో 18 లోపు వయసు ఉన్న వాళ్ళను ఏ సర్టిఫైడ్ సినిమాలకు అనుమతించరు. రజని ఫ్యాన్స్ లో చిన్నపిల్లల నుంచి ముసలాళ్ల దాకా అందరూ ఉంటారు. మరి లోపలికి రాకూడదని చెబితే గొడవలు జరిగే ప్రమాదం లేకపోలేదు. సలార్, యానిమల్ లాంటి వాటికీ ఈ సమస్య వచ్చింది కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇబ్బంది లేదు. కానీ తమిళనాడు ఫ్యాన్స్ మాములుగానే కొంచెం అతి చేస్తుంటారు. ఇప్పుడు 18 బిలో నో ఎంట్రీ అంటే సింగల్ స్క్రీన్లకు పరిగెత్తడం తప్ప వేరే మార్గం ఉండదు. సో చూడాలి ఎలా మేనేజ్ చేస్తారో.
Gulte Telugu Telugu Political and Movie News Updates