సూపర్ స్టార్ రజినీకాంత్ తమిళనాట చాలా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తుంటారని.. అందుకోసం కోట్లు ఖర్చు పెడుతుంటారని చెబుతుంటారు. ఐతే ఆయన తన సినిమాలకు పని చేసే కాస్ట్ అండ్ క్రూను కూడా ఎంత బాగా చూసుకుంటారో అక్కినేని నాగార్జున వెల్లడించారు. సూపర్ స్టార్ లీడ్ రోల్ చేసిన ‘కూలీ’లో నాగ్ విలన్ పాత్ర చేసిన సంగతి తెలిసిందే. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ.. రజినీది ఎంత గొప్ప మనసో ఒక ఉదాహరణతో చెప్పాడు నాగ్.
‘కూలీ’ సినిమాలో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను బ్యాంకాక్‌లో తెరకెక్కించినట్లు నాగ్ తెలిపాడు. ఒక షిప్ మీద 17 రోజుల పాటు పూర్తిగా నైట్ ఎఫెక్ట్‌లోనే ఈ సీక్వెన్స్ చిత్రీకరణ జరిగిందట. రజినీ కూడా అందులో పాల్గొన్నారని.. చాలా కష్టపడి, భారీ కాస్ట్ అండ్ క్రూతో ఈ సీక్వెన్స్ చేశామని నాగ్ వెల్లడించాడు. ఐతే మొత్తం చిత్రీకరణ పూర్తయ్యాక.. రజినీకాంత్ టీంలో అందరినీ పిలిచి వాళ్ల చేతుల్లో ఒక ప్యాకెట్ పెట్టారని నాగ్ తెలిపాడు. మొత్తం 350 మందికి తలో ప్యాకెట్ ఇచ్చారని.. అందులో డబ్బులు ఉన్నాయని.. వాటితో పిల్లల కోసం బ్యాంకాక్‌లో ఏమైనా కొనుక్కుని వెళ్లాలని రజినీ చెప్పినట్లు నాగ్ తెలిపారు.
రజినీ ఇలా చేయాల్సిన అసవరం లేదని.. కానీ అంత మందికి సాయం చేసి తన పెద్ద మనసును రజినీ చాటుకున్నారని నాగ్ కొనియాడారు. రజినీతో ఈ సినిమా చేయడం తనకు మరపు రాని అనుభవమన్న నాగ్.. ఇందులో తనది విలన్ పాత్రే అయినా.. హీరో స్థాయిలో ఉంటుందని చెప్పాడు. రజినీ ఈ స్క్రిప్టు విని ఎలా అంగీకరించారా అని తాను ఆశ్చర్యపోయినట్లు నాగ్ తెలిపాడు. ఈ చిత్రంలో సౌబిన్ షాహిర్ పాత్ర మైండ్ బ్లోయింగ్‌గా ఉ:టుందని.. అతను అందరినీ జేబులో పెట్టుకుని వెళ్లిపోతాడని నాగ్ వ్యాఖ్యానించాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates