టాలీవుడ్లో చిన్న సినిమాల్లో సెన్సేషనల్ హిట్స్ లిస్టు తీస్తే ‘బేబి’ పేరు అందులో కచ్చితంగా ఉంటుంది. వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ లాంటి అప్‌కమింగ్ ఆర్టిస్టులను పెట్టుకుని దర్శకుడిగా రెండు సినిమాల అనుభవం ఉన్న సాయి రాజేష్ పరిమిత బడ్జెట్లో రూపొందించిన ఈ చిత్రం రెండేళ్ల కిందట బాక్సాఫీస్ దగ్గర ప్రకంపనలు రేపింది. ఏకంగా వంద కోట్ల వసూళ్లతో పెద్ద షాకే ఇచ్చింది. ఐతే ఈ విజయం తర్వాత ఇదే టీం కలిసి ఇంకో సినిమాను అనౌన్స్ చేసింది.
ఆనంద్-వైష్ణవి జంటగా.. సాయిరాజేష్ స్క్రిప్టుతో, ఎస్కేఎన్ నిర్మాణంలో ఆ సినిమాను ప్రకటించారు. కానీ ఏం జరిగిందో ఏమో.. తర్వాత ఈ టీం బ్రేక్ అయిపోయింది. ఆనంద్, వైష్ణవి ఈ సినిమా నుంచి వైదొలిగారు. వారి స్థానంలోకి కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీప్రియ వచ్చారు. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. కాగా.. ఆనంద్, వైష్ణవిలతో సాయి రాజేష్, ఎస్కేఎన్‌లకు ఏదో గొడవ జరిగిందంటూ ఆ మధ్య గట్టి ప్రచారమే జరిగింది.
తెలుగమ్మాయిలను ఎంకరేజ్ చేయకూడదంటూ వేరే ఈవెంట్లో ఎస్కేఎన్ చేసిన కామెంట్.. వైష్ణవిని ఉద్దేశించే అన్న చర్చ జరిగింది. తర్వాత ఈ కామెంట్ల మీద ఎస్కేఎన్ వివరణ ఇచ్చినా జనాలకు సందేహాలు తొలగిపోలేదు. ఐతే ఇప్పుడు ‘బేబి’ సినిమాకు రెండు నేషనల్ అవార్డులు వచ్చిన నేపథ్యంలో మొత్తం కథ మారిపోయింది. ఈ సందర్భంగా పెట్టిన ప్రెస్ మీట్‌కు సాయి రాజేష్, ఎస్కేఎన్ మాత్రమే కాక.. ఆనంద్, వైష్ణవి సైతం వచ్చారు. అందరూ కలుపుగోలుగా కనిపించారు. మీడియా ముందు కూడా ఫ్రెండ్లీగా మాట్లాడారు. ఐతే మీడియా వాళ్లు పాత విషయాలు గుర్తు చేసి వాళ్లను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయలేదు.
ఐతే మీకు, వైష్ణవికి మధ్య ‘బేబి’ మేకింగ్ టైంలో గొడవ జరిగిందట కదా అంటూ ఓ విలేకరి ఆనంద్‌ను ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదని.. ఇదంతా మీరు ఇప్పుడు కొత్తగా సృష్టిస్తున్నదే అంటూ అతను నవ్వేశాడు. మొత్తానికి బేబి టీం సభ్యుల మధ్య ఇంతకుముందు ఏం జరిగిందో ఏమో కానీ.. ఈ చిత్రానికి నేషనల్ అవార్డులు వచ్చిన సందర్భంగా అన్ని విషయాలు పక్కకు వెళ్లిపోయి అందరూ కలిసి పోవడం శుభ పరిణామమే.
Gulte Telugu Telugu Political and Movie News Updates