భారత బ్యాడ్మింటన్ దిగ్గజం సైనా నెహ్వాల్, తన సహచర ప్లేయర్ అయిన పారుపల్లి కశ్యప్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 2018లో వీరి వివాహం జరగగా.. రెండు వారాల కిందట తామిద్దరం విడిపోతున్నట్లు సైనా ప్రకటించడం సంచలనం రేపింది. పదేళ్లకు పైగా ప్రేమలో ఉండి.. ఎంతో అండర్‌స్టాండింగ్‌తో పెళ్లి చేసుకున్న ఈ జంట మధ్య ఎందుకు విభేదాలు వచ్చాయా అని అంతా ఆశ్చర్యపోయారు.
విడాకుల గురించి సైనా మాత్రమే ప్రకటన చేయగా.. కశ్యప్ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇక అతను కూడా అధికారికంగా ఓ ప్రకటన చేయడమే తరువాయి అనుకుంటుండగా.. మళ్లీ ఇప్పుడు సైనా లైన్లోకి వచ్చింది. తాను, కశ్యప్ మళ్లీ కలిసిపోయినట్లు ప్రకటించి మీడియాకు, అభిమానులకు పెద్ద షాకిచ్చింది. కశ్యప్‌తో కలిసి వెకేషన్లో ఉన్న ఆమె.. ఈ ఫొటోను షేర్ చేస్తూ, కొన్నిసార్లు దూరం ఒకరి ఉనికి తాలూకు విలువను తెలియజేస్తుందని.. తామిద్దరం ఇంకోసారి ప్రయత్నించి చూడాలని అనుకున్నామని పేర్కొనడమే కాక.. లవ్ సింబల్స్ పెట్టి తమ మధ్య తిరిగి ప్రేమ చిగురించిన విషయాన్ని ధ్రువీకరించింది సైనా.
ఈ జంట విడిపోతున్నట్లు తెలిసి బాధ పడ్డ వాళ్లంతా.. ఈ పోస్టు చూసి హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా గతంలో కోహ్లి, అనుష్క శర్మల ఉదంతాన్ని గుర్తు చేసుకుంటున్నారు. వాళ్లిద్దరూ కొంతకాలం ప్రేమలో ఉండి, ఆ తర్వాత విడిపోయారు. కానీ ఎడబాటును తట్టుకోలేక మళ్లీ ప్రేమలో పడ్డారు. ఆపై పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులు కూడా అయ్యారు. ఐతే సైనా, కశ్యప్ పెళ్లి తర్వాత ఏడేళ్లకు విడిపోవాలని అనుకున్నారు. కానీ రెండు వారాలకే ఆ నిర్ణయంపై పునరాలోచించుకుని తిరిగి ఒక్కటయ్యారు. ఈ మొత్తం వ్యవహారంలో కశ్యప్ మౌనం వహించడం చూస్తే.. సైనా విడిపోదామనుకున్నా, కలిసి సాగడానికే అతను మొగ్గు చూపాడేమో.. అందుకే ఎక్కడా ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates