ఒక్క పాటకే ఇంత హైపంటే..?


ఒక సినిమా నుంచి టీజరో, ట్రైలరో రాబోతుంటే దాని చుట్టూ హైప్ నెలకొనడం.. అభిమానులు ఎగ్జైట్మెంట్‌తో సోషల్ మీడియాలో చర్చలు పెట్టడం మామూలే. కానీ ఒక సినిమా నుంచి ఓ పాట రిలీజవుతుంటే.. దాని గురించి ఫ్యాన్స్ విపరీతమైన హైప్ ఎక్కించేసుకుని సోషల్ మీడియాను వేడెక్కించడం ‘ఓజీ’ విషయంలో మాత్రమే జరిగింది. ‘ఓజీ’ ప్రమోషన్లను ఒక పాట లాంచ్ ద్వారా మొదలుపెట్టాలని టీం నిర్ణయించింది.

శనివారం ఫస్ట్ సింగిల్ రిలీజ్ కాబోతున్నట్లు మొన్న సోషల్ మీడియా ద్వారా అప్‌డేట్ ఇచ్చింది. ఆ సమాచారం ఇలా బయటికి వచ్చిందో లేదో.. పవన్ ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదు. మొన్నటిదాకా ‘హరిహర వీరమల్లు’ ఫెయిల్యూర్ విషయంలో బాధ పడుతున్నవాళ్లందరూ.. ఆ సంగతి పక్కన పెట్టేసి ‘ఓజీ’ మీదికి షిఫ్ట్ అయిపోయారు. ఆ పాట గురించి హైప్ ఎక్కించుకునే పనిలో పడిపోయారు.

పవన్ ఫ్యాన్స్‌ను సంగీత దర్శకుడు తమన్ కూడా బాగానే ఎంగేజ్ చేశాడు. సాంగ్ గురించి తెగ ఊరించాడు. ఓజీ సాంగ్ రావడానికి ఒక రోజు ముందు నుంచే సోషల్ మీడియా అంతా ‘ఓజీ’ సాంగ్ చర్చలతో నిండిపోయింది. టాలీవుడ్లో ఒక పాట రిలీజ్ కాబోతుండగా.. ఇంత హైప్ నెలకొనడం అరుదనే చెప్పాలి.

శనివారం పాట లాంచ్ అయ్యాక అయితే పవన్ ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదు. ముందే మరీ హైప్ చేయడం వల్ల పాట విన్నాక కొంతమేర అసంతృప్త స్వరాలు వినిపించినప్పటికీ.. ఓవరాల్‌గా పాట పవన్ ఫ్యాన్స్‌ను మెప్పించింది. లిరికల్ వీడియోలో పవన్ కనిపించిన విజువల్స్ చూసి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయారు. శనివారం ‘కూలీ’ లాంటి క్రేజీ మూవీ ట్రైలర్ లాంచ్ అయినా.. దానికి దీటుగా సోషల్ మీడియాలో ‘ఓజీ’ ట్రెండ్ అయింది. కేవలం పాటతోనే ఆ సినిమాకు పోటీ ఇచ్చింది. పాటకే ఇంత హైప్ ఉంటే.. రేప్పొద్దున ట్రైలర్ రిలీజైతే, ఆ పైన సినిమా వస్తే పవన్ ఫ్యాన్స్ ఇంకెంత హంగామా చేస్తారో అని చర్చించుకుంటున్నారు నెటిజన్లు.