క్రింజ్ కామెడీతో కిచిడీ చేశారు

హాస్యం పేరుతో ఈ మధ్య బాలీవుడ్ దర్శకులు దారి తప్పుతున్నారు. ప్రేక్షకులను నవ్వించాలంటే లౌడ్ కామెడీ తప్ప వేరే మార్గం లేదన్న భ్రమతో స్టార్ హీరోల ఇమేజ్ ని తాకట్టు పెడుతున్నారు. ఆ మధ్య వచ్చిన హౌస్ ఫుల్ 5 లో ఉన్న బూతు కంటెంట్ కి విమర్శకులే భయపడ్డారు. డబ్బులైతే వచ్చాయి కానీ మరీ అంత డబుల్ మీనింగ్ సరుకును ఆడియన్స్ తట్టుకోలేకపోయారు. ఫలితంగా క్లీన్ ఎంటర్ టైనర్ గా పేరున్న ఈ ఫ్రాంచైజ్ మీద బ్యాడ్ రిమార్క్ పడింది. ఇప్పుడు దీని సరసన ఇంకో మూవీ వచ్చింది. అదే సన్నాఫ్ సర్దార్ 2.  కింగ్డమ్ కోసం ఒక రోజు ఆలస్యంగా రిలీజైన ఈ సినిమాలో అజయ్ దేవగన్ హీరో. 

కథ కొత్తగా ఏం ఉండదు. భార్య డింపుల్ (నీరూ బాజ్వా) ని తెచ్చుకునేందుకు స్కాట్ ల్యాండ్ వెళ్లిన జస్విందర్ సింగ్ ఉరఫ్ జెస్సి (అజయ్ దేవగన్) కు ఆమె షాక్ ఇస్తుంది. విడాకులు కావాలని, వేరొకరిని ఇష్టపడ్డానని చెబుతుంది. దీనికి జెస్సి అంగీకరించడు. అప్పుడే పాకిస్థాన్ కు చెందిన రుబియా (మృణాల్ ఠాకూర్) తో పాటు మరో ముగ్గురు మహిళలు అతనికి పరిచయమవుతారు. వాళ్లలో సబా (రోషిణి) కి ప్రేమ పెళ్లి చేసే బాధ్యతని జెస్సి తీసుకుంటాడు. కుర్రాడి తండ్రి గూగి (రవికిషన్) ఇంటికి వెళ్లి అబద్దాలతో డ్రామా మొదలుపెడతాడు. చివరికి ఏమైంది, జెస్సీ జీవితంలో ఇంకేమేం జరిగాయనేది తెరమీద చూసి తరించాలి. 

దర్శకుడు విజయ్ కుమార్ అరోరా కొత్తగా ఆలోచిస్తే నేరమనే తరహాలో అవుట్ డేటెడ్ ట్రీట్ మెంట్ తో సన్నాఫ్ సర్దార్ 2ని తీర్చిదిద్దాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం పాత్రల పరిచయాలు, వాళ్ళ సంబంధాలతోనే గడిచిపోయి బోర్ కొట్టిస్తుంది. అక్కడక్కడా కొన్ని జోకులు పేలినప్పటికీ అవి ఏ మాత్రం సరిపోలేదు. సెకండాఫ్ లో రవికిషన్ ఇంటికి వెళ్ళాక మొదలయ్యే రెడీ టైపు కామెడీ సహనాన్ని పరీక్షిస్తుంది. రోత హాస్యాన్ని ఎంజాయ్ చేసేవాళ్ళకు ఏమో కానీ మిగిలినవాళ్ళు భరించడం కష్టం. ట్రోలింగ్ సీన్లు, డాన్సులు పుష్కలంగా ఉన్నాయి. మర్యాదరామన్న రీమేక్ గా వచ్చిన మొదటి భాగం పేరుని చెడగొట్టేలా సన్నాఫ్ సర్దార్ 2 ఉంది.