కింగ్‌డ‌మ్ చూడండి.. న‌చ్చ‌కపోతే తిట్టండి

ఈ రోజు భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమా.. ఓ మోస్త‌రు టాక్ తెచ్చుకుంది. చూసిన వాళ్లంద‌రూ ప్ర‌థ‌మార్దం బాగుందంటున్నారు. ద్వితీయార్ధం విష‌యంలోనే కంప్లైంట్స్ చేస్తున్నారు. సినిమాకు ఇలామిక్స్డ్ టాక్ రావ‌డంపై నిర్మాత నాగ‌వంశీ స్పందించాడు. హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌లిసి స‌క్సెస్ ప్రెస్ మీట్‌లో పాల్గొన్న నాగ‌వంశీ.. సినిమాకు డివైడ్ టాక్ రావ‌డాన్ని తేలిగ్గా తీసుకున్నారు. సెకండాఫ్ స్లో అని.. కొంచెం వీక్ అని వ‌స్తున్న ఫీడ్ బ్యాక్‌ను.. సోష‌ల్ మీడియా కామెంట్ల‌ను పట్టించుకోవ‌ద్ద‌ని ప్రేక్ష‌కుల‌ను కోరాడు నాగ‌వంశీ. సినిమాకు ఓవ‌రాల్‌గా చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తోంద‌ని.. ఆడియ‌న్స్ రివ్యూలు, సోష‌ల్ మీడియా కామెంట్ల‌ను ప‌ట్టించుకోకుండా వ‌చ్చి సినిమా చూడాల‌ని.. క‌చ్చితంగా సంతృప్తి చెందుతార‌ని.. ఒక‌వేళ సినిమా చూసి న‌చ్చ‌క‌పోతే ఫోన్ చేసి త‌మ‌ను తిట్ట‌వ‌చ్చ‌ని.. ఫోన్లో అందుబాటులో ఉంటామ‌ని నాగ‌వంశీ కామెంట్ చేశాడు.

తాము హాలీవుడ్‌కు ఏమాత్రం తీసిపోని రీతిలో బాగా ఖ‌ర్చు పెట్టి అద్భుత‌మైన విజువ‌ల్స్‌తో సినిమా తీశామ‌ని.. సినిమాలో హైలైట్ అనిపించే ఎపిసోడ్లు చాలా ఉన్నాయ‌ని నాగ‌వంశీ పేర్కొన్న‌డు. కింగ్‌డ‌మ్ సినిమాలో హీరోయిన్ భాగ్య‌శ్రీ బోర్సే పాత్ర‌కు స‌రైన ప్రాధాన్యం లేక‌పోవ‌డం, హీరో హీరోయిన్ల మ‌ధ్య పాట‌ను తీసేయ‌డం గురించి నాగ‌వంశీ స్పందించాడు. భాగ్య‌శ్రీకి కింగ్‌డ‌మ్-2లో ఎక్కువ రోల్ ఉంటుంద‌ని చెప్పాడు.

ఇక పాట గురించి మాట్లాడుతూ.. విజ‌య్ కిస్ కోసం ఫ్యాన్స్ చూసి, అది లేక‌పోయేస‌రికి డిజ‌ప్పాయింట్ అయ్యారేమో అని చ‌మ‌త్క‌రించాడు నాగ‌వంశీ. ఈ సినిమాకు వ‌ర‌ల్డ్ వైడ్ అదిరిపోయే ఓపెనింగ్ వ‌స్తోంద‌ని.. అన్ని చోట్లా హౌస్ ఫుల్స్ న‌డుస్తున్నాయ‌ని.. సీడెడ్ స‌హా ప‌లు ఏరియాల్లో తొలి రోజే స‌గం బ్రేక్ ఈవెన్ అయిపోయేలా క‌నిపిస్తోంద‌ని నాగ‌వంశీ వ్యాఖ్యానించాడు. కింగ్‌డ‌మ్ మూవీకి త్వ‌ర‌లోనే ఆంధ్రా ప్రాంతంలో ఒక భారీ స‌క్సెస్ మీట్ ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించాడు. ఆ ఈవెంట్‌కు ఏపీ ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తారా అని అడిగితే.. అదేమీ లేద‌ని, త‌మ‌కు విజ‌యే ప‌వ‌న్ క‌ళ్యాణ్ అని పేర్కొన్నాడు నాగ‌వంశీ. కింగ్‌డ‌మ్ పార్ట్-2 ఇంకా గ్రాండ్‌గా తీస్తామ‌ని ఈ సంద‌ర్భంగా నాగ‌వంశీ చెప్పాడు.